సరికొత్త ప్రయత్నాలతో, ప్రయోగాలతో దర్శకుడు తేజ సంపాదించిన పేరు, సృష్టించిన సినిమాలు మామూలు విషయాలు కాదు. ఒకప్పుడు అంతా కొత్తవాళ్ళతోనే వరుస బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించి, ఎంతోమంది కొత్తవాళ్ళను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత తేజకు దక్కింది. అయితే తాజాగా ఆయన సినిమాలేవీ ఆ ప్రాభవాన్ని చూపలేకపోయాయ్! వరుస అపజయాల తర్వాత మళ్ళీ ఓ సరికొత్త ప్రయత్నంతో హిట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు తేజ. తాజాగా తేజ అంతా కొత్తవాళ్ళతో ‘హోరాహోరీ’ అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం ‘హోరాహోరీ’ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి కాగా వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దిలీప్, దక్షలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ రూపొందుతోన్న ‘హోరాహోరీ’ సినిమా విషయంలో ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఈ సినిమాకు పనిచేసే టెక్నీషియన్స్ అందరినీ తెలంగాణ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నుంచి ఎంపిక చేయడం విశేషం. కోడూరి కళ్యాణ్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో ఈ నెలాఖర్లో విడుదల కానుంది. కె.ఎల్.దామోదర ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


