అక్టోబరు వరకు ఆగండి.. నిర్మాతలకు ఎగ్జిబిటర్స్‌ విన్నపం.!

అక్టోబరు వరకు ఆగండి.. నిర్మాతలకు ఎగ్జిబిటర్స్‌ విన్నపం.!

Published on Jul 3, 2021 7:29 PM IST


కరోనా కారణంగా చాలా రోజులుగా సినిమా థియేటర్లు మూతపడ్డ సంగతి తెలిసిందే. అయితే కరోనా థర్డ్ వేవ్ కూడా ఉంటుందన్న హెచ్చరికల నేపధ్యంలో అసలు థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఈ కారణంగా ఇప్పటికే షూటింగ్‌లను పూర్తి చేసుకున్న చాలా సినిమాలు ఓటీటీల వైపు చూస్తున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా తెలంగాణ ఫిల్మ్‌ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్యర్వంలో ఎగ్జిబిటర్స్‌ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో సినిమా రిలీజ్‌లపై చర్చించిన ఎగ్జిబిటర్స్‌ అక్టోబరు వరకు నిర్మాతలు వేచి చూడాలని అప్పటికి థియేటర్స్‌ రీ ఓపెన్‌ కాకపోతే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో సినిమాలను రిలీజ్ చేసుకోవాలని కోరుతున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఈ సమావేశానికి హాజరైన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. తెలుగు సినీ పరిశ్రమను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలందరు మా విన్నపాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నట్టు తెలిపారు. అయితే తెలుగు ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌లో ఈ నెల 7న జనరల్‌ బాడీ మీటింగ్‌ను నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్ణయించుకుందని ప్రకటించారు.

దీంతో పాటు సినిమా టికెట్‌ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వానికి కూడా ఎగ్జిబిటర్స్‌ ఓ విన్నపం చేశారు. తక్కువ ధరకు సినిమా టికెట్‌ రేట్లు ఉంటే అది థియేటర్స్, ఎగ్జిబిటర్స్‌ సెక్టార్‌ మనుగడకే సమస్యగా మారుతుందని, థియేటర్స్‌లో సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలకు ముందుకు రారని, చాలా మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని దీనిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పునః పరిశీలించుకోవాల్సిందిగా కోరుతున్నట్టు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు