సిస్ ఫిలిమ్స్ బ్యానర్‌పై సైఫుద్దీన్ మాలిక్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘విచిత్ర’. కుటుంబ బంధాలు, ఎమోషన్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్‌తో సహా నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని, మే 22న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో రవి, శ్రేయ తివారీ హీరో హీరోయిన్లుగా నటించగా, జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్ర పోషించారు. బేబీ శ్రీ హర్షిణి, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతి శేఖర్, మీనా వాసన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ.. “ప్రపంచం మొత్తం దూరమైనా, ఎప్పుడూ దగ్గరగా ఉండేది అమ్మ ప్రేమే” అనే గొప్ప సెంటిమెంట్ పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. ప్రతి తల్లి గుండెను హత్తుకునేలా ఈ కథ ఉంటుందని, ఇది కుటుంబసమేతంగా ఎంజాయ్ చేస్తూ చూడదగ్గ చిత్రమని ఆయన పేర్కొన్నారు.
ఈ సినిమాలోని పాటలు అద్భుతంగా వచ్చాయని, ముఖ్యంగా ప్రముఖ గాయని చిత్ర పాడిన మాతృమూర్తి సెంటిమెంట్ పాట సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. చిన్న చిత్రంగా వస్తున్న ‘విచిత్ర’ను ప్రేక్షకులు, మీడియా ఆదరించి విజయవంతం చేయాలని సైఫుద్దీన్ మాలిక్ కోరారు.


