ఒకేరోజు 10 సినిమాలు.. ఎవరికి నష్టం

ఒకేరోజు 10 సినిమాలు.. ఎవరికి నష్టం

Published on Jun 19, 2019 7:04 PM IST

చిన్న బడ్జెట్ సినిమాలకు కొద్దిపాటి థియేటర్లు దొరికినా చాలు పెట్టిన పెట్టుబడి వెనక్కు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పెద్ద సినిమాలు లేని వారం చూసి తమ చిన్న సినిమాలని విడుదలచేస్తుంటారు. ఎప్పటిలాగే ఈ వారం కూడా భారీ సినిమాలు లేకపోవడంతో తన సినిమాకు కలిసొస్తుందని నిర్మాతలు చాలామంది ఎవరికివారు అనుకుని విడుదలకు సిద్ధమయ్యారు.

కానీ తీరా చూస్తే పెద్ద సినిమాల నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఆ చిన్న సినిమాలే ఒకదానికి మరొకటి నష్టం చేకూర్చే పరిస్థితి తలెత్తింది. ఈ శుక్రవారం 21వ తేదీన 10 సినిమాలు విడుదలకావడాన్ని చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ‘మల్లేశం, ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ, ఓటర్, స్పెషల్, స్టువర్ట్ పురం, ఫస్ట్ ర్యాంక్ రాజు, కెప్టెన్ రానా ప్రతాప్’ లాంటి 7 డైరెక్ట్ తెలుగు సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. వీటికి తోడు ‘గొరిల్లా, గజేంద్రుడు, ఆఖరి పోరాటం’ లాంటి డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి.

ఈ 10 సినిమాలు థియేటర్లను పంచుకున్నట్టే వీకెండ్ రోజున సినిమాకి వచ్చే ప్రేక్షకుల సంఖ్యను కూడా పంచుకుంటే ఎవరికివారు నష్టపోవడం ఖాయం. అసలే చిన్న సినిమాలు… వీటిలో సగం జనానికి తెలియని కూడా తెలియవు. ఇలాంటి సినిమాలు ఒకేరోజు రెండో మూడో.. మహా అయితే నాలుగో వస్తే వసూళ్ల షేరింగ్ కొంచెం లాభదాయకంగా ఉంటుంది కానీ ఇలా ఒకేసారి పది వస్తే అందరికీ సంతృప్తికరమైన కలెక్షన్స్ రావడం కష్టమే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు