కోవిడ్ లాక్ డౌన్ కారణంగా ఏడు నెలలకు పైగా సినిమా థియేటర్లు మూతబడ్డాయి. దీంతో సినిమాలు విడుదలతో పాటు థియేటర్ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న వేల మందికి జీవనోపాధి కరువైంది. మళ్ళీ సినిమా హాళ్లు తెరుచుకుంటేనే కానీ సినిమాలు విడుదల ఉండదు. అప్పుడే సినీ, థియేటర్ రంగాలు మళ్ళీ పుంజుకుంటాయి. నిన్నమొన్నటి వరకు వినిపించిన వార్తల మేరకు ఈ డిసెంబర్ నెలలోనే థియేటర్లు ఓపెన్ కావాల్సి ఉంది. అయితే తాజాగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తాజాగా జరిపిన సమావేశంలో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు, థియేటర్ యాజమాన్యాలకు కొన్ని షరతులు విధించింది.
ఇంతకుముందులా నిర్మాతలు ఇకపై వర్చ్యువల్ ప్రింటింగ్ ఫీజును చెల్లించరు. కంటెంట్ ట్రాన్స్పోటేషన్ కొరకు పెద్ద పెద్ద మొత్తాలను కాకుండా నామమాత్రపు ఫీజును మాత్రమే చెల్లిస్తారు. క్యూబ్, యూఎఫ్ఓ లాంటి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు తమ వద్ద ఉన్న రెండేళ్లు లేదా అంతకంటే పాతవైన ప్రొజెక్టర్లను థియేటర్ యాజమాన్యాలకు విక్రయించాలి. తద్వారా థియేటర్ యాజమాన్యాలు ప్రకటనల ద్వారా ఆదాయం పొందడానికి వీలు కల్పించాలి. ఒకవేళ యాజమాన్యాలు ప్రొజెక్టర్లను కొనలేకపోతే నిర్మాతలు వారికి ఎంతో కొంత సహకారం అందిస్తారు. ఈ కండిషన్లకు గనుక డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు అంగీకరించకపోతే థియేటర్ ఓనర్లు వాళ్ళ సొంత ప్రాజెక్టులతో ముందుకెళతారు. ఈ అంశాలన్నీ ఆమోదం పొందేవరకు థియేటర్లు తెరుచుకోవు అంటూ స్పష్టం చేశారు.


