దర్శకుడిగా ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ చిత్రంతో ఘనవిజయం సాధించి, తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు తరుణ్ భాస్కర్. తాజాగా వైజాగ్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్ ఈవెంట్‌లో తరుణ్ తొలిసారిగా ఎంతో ఆవేశంతో, దృఢ సంకల్పంతో మాట్లాడాడు. “ఇప్పటివరకు నా సినిమాల్లో డబ్బుకు విలువ లేదని, దాని వెంట పడకూడదని చెప్పాను. కానీ ఇకపై నేను డబ్బు వెంట పడతాను. A, B, C అనే తేడా లేకుండా అన్ని సెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకునేలా నా నెక్స్ట్ సినిమా ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశాడు.
తనను తక్కువ అంచనా వేసిన వారందరికీ ఒక నిజాయితీ గల గొంతుక ఎంత దూరం వెళ్తుందో చేసి చూపిస్తానని సవాల్ విసిరాడు. ఎవరి ముందూ మోకరిల్లి ‘సార్, మేడమ్’ అంటూ బతిమాలే ప్రసక్తే లేదని, ఇకపై అంతా రివర్స్‌లో జరుగుతుందని తరుణ్ భాస్కర్ తన ఆలోచనా విధానంలో వచ్చిన మార్పును బయటపెట్టాడు. ఎక్కడ తప్పు జరిగినా సినిమా ద్వారానే దాన్ని సరిదిద్దుతానని ఆయన అన్నాడు.
‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ విజయం తనకు ఎంతో కొత్త ఆశను ఇచ్చిందని, ప్రేక్షకులు చూపించిన ఈ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపాడు. ఎప్పుడూ సరదాగా మాట్లాడే తరుణ్, ఈ వేడుకలో మాత్రం ఎంతో కసితో కనిపించడం విశేషం.


