ఆ సినిమాల స్ట్రాటెజీ ఫాలో అయితే ‘ది ప్యారడైజ్’ కష్టమే..!

ఆ సినిమాల స్ట్రాటెజీ ఫాలో అయితే ‘ది ప్యారడైజ్’ కష్టమే..!

Published on Jul 9, 2026 2:00 AM IST

ఇటీవల కాలంలో టాలీవుడ్ సినిమాలకు విడుదల ముందే ‘క్లైమాక్స్’ అంటూ విపరీతమైన హైప్ క్రియేట్ చేయడం ఒక అలవాటుగా మారింది. తాజాగా నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం కూడా ఇదే బాట పట్టింది. ఈ సినిమా క్లైమాక్స్ చూసి షాక్ అయ్యానంటూ గీత రచయిత కాసర్ల శ్యామ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ అభిమానుల్లో ఆశలు రేకెత్తించినప్పటికీ, పరిశ్రమ వర్గాల్లో మాత్రం ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మార్చి నుంచి ఆగస్ట్‌కు, ఆపై సెప్టెంబర్ 2026కు వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. ఇలాంటి తరుణంలో కేవలం సినిమాను వార్తల్లో ఉంచడానికే ఇటువంటి అతిగా ఊరించే లీకులు ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

​గతంలో ‘పెద్ది’, ‘రాజా సాబ్’, ‘దేవర’ వంటి చిత్రాల విషయంలోనూ చివరి 20, 30 నిమిషాలు అద్భుతంగా ఉంటాయంటూ చిత్ర యూనిట్ భారీగా ప్రచారం చేసింది. తీరా థియేటర్లలో చూస్తే ఆ బిల్డప్‌కు, అసలు కంటెంట్‌కు అస్సలు పొంతన లేకపోవడంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒకవేళ ‘ది ప్యారడైజ్’ క్లైమాక్స్ కూడా ఊహించిన స్థాయిలో లేకపోతే, ఈ మితిమీరిన అంచనాలే సినిమాకు శాపంగా మారే ప్రమాదం ఉంది. శ్రీకాంత్ ఓదెల గత చిత్రం ‘దసరా’ ముగింపు బాగున్నప్పటికీ, ప్రతిసారీ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని చెప్పలేం.

​నాని కెరీర్‌లోనే అత్యంత భారీ పాన్-ఇండియా బడ్జెట్‌తో, మోహన్ బాబు, అనైరుధ్ సంగీతం వంటి క్రేజీ కాంబినేషన్లతో వస్తున్న సినిమా ఇది. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విషయంలో క్లైమాక్స్ “నెక్స్ట్ లెవెల్” అంటూ ముందే డబ్బా కొట్టడం వల్ల ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్స్ స్కై హైకి వెళ్ళిపోతాయి. ప్రచార ఆర్భాటం ఎక్కువై, థియేటర్లో కంటెంట్ తేలిపోతే వచ్చే నెగిటివ్ టాక్ సినిమాను కోలుకోలేని దెబ్బ తీస్తుంది. కాబట్టి మేకర్స్ ఇప్పటికైనా ఈ ముందస్తు అతి భజనను పక్కనబెట్టి, ప్రమోషన్ల విషయంలో కాస్త సంయమనం పాటిస్తే మంచిదని ఫాన్స్ అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు