పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది రాజా సాబ్’పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2026 జనవరి 9న భారీగా విడుదలకు సిద్ధమవుతుండగా, జనవరి 8న పెయిడ్ ప్రీమియర్లు ప్లాన్ చేశారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు మారుతి ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
‘ది రాజా సాబ్’ చిత్రానికి నాలుగు గంటలకు పైగా రా ఫుటేజ్ ఉందని మారుతి తెలిపారు. “పెద్ద సినిమాల విషయంలో ఎక్కువ షాట్స్ తీస్తాం. థియేటర్లలో ప్రేక్షకులు చూడబోయే మూడు గంటల సినిమాతో పాటు, నా దగ్గర మరో గంట ఫుటేజ్ ఉంది. కానీ అన్ని సన్నివేశాలను సినిమాలో పెట్టడం సాధ్యం కాదు. కొన్ని భాగాలను తప్పించాల్సి వచ్చింది. తీసేసిన సన్నివేశాలు కూడా అద్భుతంగానే ఉంటాయి” అని ఆయన చెప్పారు.
ప్రభాస్ ప్రతి విషయంలో డీటెయిల్డ్‌గా ఉండాలని కోరుకుంటారని.. ది రాజా సాబ్ సినిమా చేస్తూ తాను చాలా నేర్చుకున్నానని.. ఈ చిత్రం తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌పై పని చేయడం యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన అనుభూతిని ఇచ్చిందంటూ మారుతి కామెంట్ చేశారు.


