అనన్య క్రియేషన్స్ బ్యానర్‌పై కైలాష్ దుర్గం నిర్మాణంలో, జోయల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తెరచాప’. నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ వేడుకను అట్టహాసంగా నిర్వహించింది.
మత్స్యకారుల జీవితాల ఆధారంగా సముద్ర తీరాన ఈ సినిమాను అత్యంత సహజంగా చిత్రీకరించారు. మండుటెండల్లో సముద్రపు ఇసుకలో నటీనటులు ఎంతో కష్టపడి పనిచేశారని సీనియర్ నటుడు రాజీవ్ కనకాల ప్రశంసించారు. ఎన్నో ఒత్తిళ్లను తట్టుకుని అద్భుతంగా నటించిన హీరో నవీన్.. ఈ చిత్రాన్ని తన తండ్రికి అంకితం ఇవ్వడం అభినందనీయమన్నారు. నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. మత్స్యకారుల కష్టాలను కళ్లకు కట్టేలా చూపించారని, తన కూతురు శ్రీలు ఇందులో నటించడం సంతోషంగా ఉందన్నారు.
కేవలం కథపై ఉన్న నమ్మకంతోనే ఈ సినిమా తీశానని నిర్మాత కైలాష్ దుర్గం పేర్కొన్నారు. జగదీష్ ప్రతాప్ బండారి, నాగ మహేష్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రజల్ క్రిష్, ఎం.ఎల్ రాజా సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్‌కు ఇప్పటికే మంచి స్పందన రాగా, ఏప్రిల్ 17న విడుదలవుతున్న తమ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేయాలని హీరో నవీన్, దర్శక నిర్మాతలు ప్రేక్షకులను కోరారు.
