తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర అభిమానుల సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తమిళనాడులో ఎటు చూసినా పండుగ వాతావరణం నెలకొంటుంది. రజినీ సినిమా వస్తుందంటే అభిమానులు ముందస్తుగానే రెడీ అయిపోతారు. కానీ, రజినీ నటించిన ఓ సినిమా ఇప్పుడు ఏకంగా 37 ఏళ్ల తర్వాత రిలీజ్‌కు వస్తుండటంతో అభిమానులకు ఈ మూవీపై క్లూ కూడా లేదు.
రజినీకాంత్, శత్రుఘ్ను సిన్హా, హేమా మాలిని లీడ్ రోల్స్‌లో నటించిన బాలీవుడ్ చిత్రం ‘హమ్ మే షెహెన్‌షా కౌన్’ అనే సినిమా 37 ఏళ్ల క్రితమే తెరకెక్కింది. కానీ, పలు కారణాలతో ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఈ చిత్రాన్ని దివంగత హర్మేష్ మల్హోత్రా డైరెక్ట్ చేశారు. అయితే, ఇప్పుడు ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు నిర్మాత రాజా రాయ్ తాజాగా ఓ ప్రకటన చేశారు. ఈ చిత్రాన్ని ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు తామె ఎంతగానో కష్టపడ్డామని.. తాము చాలా అడ్డంకులను ఎదుర్కొన్నామని ఆయన పేర్కొన్నారు.
ఇక ఈ సినిమాలో అనితా రాజ్, ప్రేమ్ చోప్రా, శరత్ సక్సెనా, దివంగ నటులు అమ్రిష్ పూరి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మరి 37 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ రజినీకాంత్ చిత్రంపై అభిమానులు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.


