సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘జైలర్ 2’ గురించి ఒక సంచలన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది.
ఈ సినిమాలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపిస్తారని గతంలో ప్రచారం జరిగినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ కామియో రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ‘భగవాన్ దాదా’ (1986) చిత్రం తర్వాత, దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం రజినీకాంత్, హృతిక్ రోషన్ కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ఈ బాలీవుడ్ స్టార్‌కి సంబంధించిన కీలక సన్నివేశాలను జూన్ 22, 23 తేదీల్లో చెన్నైలో చిత్రీకరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ క్రేజీ అప్‌డేట్ ఇటు సౌత్ అటు నార్త్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను ఒక్కసారిగా స్కై హైకి తీసుకెళ్లింది. సన్ పిక్చర్స్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, ఎస్.జె.సూర్య, మోహన్‌లాల్, రమ్యకృష్ణ, మిర్నా మీనన్, యోగి బాబు వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


