రెండు వారాల వ్యవధిలో రెండు సినిమాలు విడుదల కావడం ఆనందంగా ఉంది – రాజ్ బాల

Published on Jan 25, 2021 6:30 am IST

అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఆరామ్ గా సాగిపోయే ఉద్యోగాన్ని వదులుకుని మరీ… చిత్ర పరిశ్రమలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ చిత్తశుద్ధితో కృషి చేస్తూ వస్తున్నాడు యువ నటుడు రాజ్ బాల. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. పదేళ్లుగా తను పడుతున్న కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడిప్పుడు లభిస్తోందని ఆనందపడుతున్నాడు. 7 టు 4, లవ్ బూమ్, అంతకుమించి’ వంటి చిత్రాలతో ఇప్పటికే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజ్ బాల హీరోగా నటించిన ‘చిత్రం x’ జనవరి 1 న విడుదల కాగా…రాజ్ బాల విలన్ గా నటించిన “తొంగి తొంగి చూడమాకు చందమామ” ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆనంద్ కానుమోలు దర్శకత్వంలో ఎ.మోహన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. దిలీప్-శ్రావణి జంటగా నటించిన ఈ చిత్రంలో రాజ్ బాల పోషించిన “రాణా బాబు” పాత్రకు మంచి స్పందన వస్తోంది.

రాజ్ బాల మాట్లాడుతూ… “రెండు వారాలు వ్యవధిలో రెండు సినిమాలు విడుదల కావడం… ఒకదాంట్లో హీరోగా, ఇంకోదానిలో మెయిన్ విలన్ గా నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ రెండు సినిమాలు చూసినవారంతా నా పెర్ఫార్మన్స్ చాలా బాగుందంటున్నారు. నా జర్నీలో నాకు సహకరించిన, సహాయపడిన ప్రతి ఒక్కరికీ ఈసందర్భంగా పేరు పేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను నటించిన “మిస్టర్ క్యూ, 5 W’s,” విడుదలకు సిద్దంగా ఉండగా… ప్రస్తుతం ‘కృష్ణలంక’ అనే చిత్రంతోపాటు ఇంకా పేరు పెట్టని మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నాను” అని అన్నారు!!

సంబంధిత సమాచారం :