
‘ప్రేమ కథా చిత్రమ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన జె. ప్రభాకర్ రెడ్డి మళ్ళీ చాలాకాలం తర్వాత ‘అనగనగా ఒక చిత్రం’ పేరుతో తన రెండో సినిమాను సిద్ధం చేశారు. ప్రభాకర్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని డిసెంబర్ 11న విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సందర్భంగా హైద్రాబాద్‌లో సినిమా యూనిట్ ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సినిమా విశేషాలను పంచుకుంది. దర్శకుడు ప్రభాకర్ రెడ్డితో పాటు హీరోగా నటించిన శివ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇక హీరో శివ మాట్లాడుతూ.. “నా మొదటి సినిమా ‘జగన్’కు పూర్తి భిన్నమైన కథతో నడిచే ఈ సినిమాలో నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. లవ్, థ్రిల్లర్, కామెడీ ప్రధానంగా నడిచే ఈ సినిమాలో రెండు అంశాలు చాలా కొత్తగా ఉంటాయి. అందులో ఒకటి ఈ సినిమాకు పెట్టిన టైటిల్ వెనకున్న కథ, నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే కొంత ఇంటరెస్టింగ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ప్రభాకర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా”అన్నారు. ఈ సినిమాలో శివ సరసన మేఘశ్రీ హీరోయిన్‌గా నటించారు.

