“నవరస నటతారకం” ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు

“నవరస నటతారకం” ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు

Published on May 20, 2019 8:52 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. మే 20 1983 జన్మించిన ఆయన నేడు 36 వ వసంతం లోకి అడుగుపెట్టారు. తెలుగు పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రత్యేకమైన నటుడు . ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. తాతగారి నటవారసత్త్వాన్ని పుణికిపుచ్చుకున్న ఎన్టీఆర్ తాతకు తగ్గ మనువడిగా ఎప్పుడో తెలుగు చలన చిత్ర పరిశ్రమపై తనముద్ర వేశారు. ఆయన నృత్యం అమోఘం, ఉచ్చారణ అనిర్వచనీయం. నటన అద్భుతం. ఒక నటుడిగానే కాక గాయకుడిగా కూడా పలు చిత్రాలలో ఆయన తన గొంతు సవరించారు.
స్వతహాగా కూచిపూడి డాన్సర్ అయిన ఎన్టీఆర్ 1996 గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన “బాలరామాయణం” మూవీతో బాల నటుడిగా తెరంగేట్రం చేశారు . 2000 సంవత్సరం లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై మొదటిసారి హీరోగా “నిన్ను చూడాలని” మూవీతో తన ప్రస్థానం మొదలుపెట్టారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన ‘స్టూడెంట్ నం .1″ మూవీతో మొదటి విజయం అందుకున్న ఎన్టీఆర్, 19 ఏళ్ల వయసుకే ‘ఆది’, ‘సింహాద్రి’, వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి టాలీవుడ్లో తిరుగులేని స్టార్ గా ఎదిగారు. తక్కువ వయసులోనే వచ్చిపడిన అంత పెద్ద స్టార్ డమ్ ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఎన్టీఆర్ విఫలం ఐయ్యారు. సినిమాల ఎంపిక విషయంతో ఎన్టీఆర్ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఆయనకు ఒక దశలో వరుస పరాజయాలు ఎదురైనాయి. తనకు ‘సింహాంద్రి’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన రాజమౌళి తో చేసిన “యమదొంగ ” మూవీతో ఆయన మళ్ళీ విజయాల బాట పట్టారు.
ఎన్టీఆర్ నటుడుగానే కాక తెలుగులో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 1 కి వ్యాఖ్యాతగా చేసి ఔరా అనిపించారు. ఇలా ఎన్టీఆర్ తన మల్టీ టాలెంట్స్ తో తన అభిమానుల్ని అలరిస్తూ తన జర్నీ సాగిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చరణ్ తో కలిసి రాజమౌళి తీస్తున్న “ఆర్ ఆర్ ఆర్” అనే ప్రతిష్టాత్మక మల్టీ స్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు