మన హీరోల కాన్ఫిడెన్స్ చూస్తే ముచ్చటేస్తుంది

Published on May 18, 2021 2:00 am IST

గత ఏడాది పడ్డట్టే ఈ ఏడాది కూడ లాక్ డౌన్ పడింది. అయితే మొదటి వేవ్ సమయంలో ఉన్నట్టు ఈసారి ఏడు ఎనిమిది నెలల లాక్ డౌన్ అయితే ఉండదు. మహా అయితే రెండు నెలలు. ఈలోపు సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మూతబడిన సినిమా హాళ్లు త్వరలోనే తెరుచుకుంటాయి. మొదటి లాక్ డౌన్ సమయంలో అయితే అసలు సినిమా హాళ్లకు పూర్వ వైభవం వస్తుందా, ఓటీటీలకు అలవాటుపడిన ప్రేక్షకులు థియేటర్ల వైవు చూస్తారా అనే అనుమానాలు గట్టిగా ఉండేవి. పూర్తైన సినిమాలను ఓటీటీకి ఇచ్చేయాల వద్దా అనే మీమాంస అందరి హీరోల్లోనూ నడిచింది. కొందరు ఓటీటీల బాట పట్టారు కూడ.

ఆ సంకోచంలోనే సినిమాలు విడుదలయ్యాయి. తెలుగు సినీ ప్రేమికులు అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ సినిమా హాళ్లకు క్యూ కట్టారు. బాగున్న సినిమాలను బ్లాక్ బస్టర్ చేశారు. ‘క్రాక్, ఉప్పెన, రెడ్, జాతిరత్నాలు’ లాంటి హిట్స్ దక్కాయి ఇండస్ట్రీకి. ఈ ఫలితాలతో థియేటర్ అనుభవం మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏమాత్రం సన్నగిల్లలేదని రూఢీ అయింది. ఇదే మన హీరోలకు సెకండ్ లాక్ డౌన్ టైంలో కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. గతంలో మాదిరి ఈసారి పూర్తైన సినిమాలు రిలీజ్ అవుతాయా లేదా అనే కంగారు ఎవరిలోనూ కనబట్లేదు. అందుకు నిదర్శనమే మధ్యతరహా, పెద్ద సినిమాలు ఏవీ ఓటీటీలకు వెళ్లకపోవడం. కాస్త ఆలస్యమైనా థియేటర్లలోకే వెళ్ళొచ్చని, వెళితే ప్రేక్షకుల నుండి ఆదరణ తప్పకుండా ఉంటుందని హీరోలు చాలా నమ్మకంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :