కమల్ హాసన్‌కు మరో అరుదైన గౌరవం!

Kamal-Hassan
నటనలో దేశవ్యాప్తంగా తనదైన బ్రాండ్‌ను చాటి చెప్పిన నటుల్లో కమల్ హాసన్‌ ఒకరు. ఎప్పుడూ ఏదో ప్రయోగంతో మనముందుకు వచ్చే ఆయన సుమారు 5 దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకొని ఇప్పటికీ అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. ఇక తాజాగా ఆయనకు ఫ్రాన్స్ ప్రభుత్వం ఓ అరుదైన సత్కారాన్ని ప్రకటించింది. సినీ పరిశ్రమకు కమల్ చేసిన సేవలకు గానూ, ఫ్రాన్స్ ప్రభుత్వం చెవలైర్ అనే అవార్డును ప్రకటించింది. అక్కడి ప్రభుత్వం ప్రకటించే అరుదైన పురస్కరాల్లో ఈ పురస్కారాన్ని ఒకటిగా చెప్పుకోవచ్చు.

కొద్దినెలల క్రితమే ఇండియన్ సినిమాకు కమల్ అందించిన సేవలకు గుర్తింపుగా హెన్రీ లాంగ్లోయిస్ అనే అవార్డు అందుకున్న కమల్, ఇప్పుడు చెవలైర్ అవార్డును కూడా అందుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. పారిస్‌లో జరిగే ఓ వేడుకలో త్వరలోనే కమల్ హాసన్ ఈ అవార్డును స్వీకరించనున్నారు. ఇక కమల్‌కు ఈ సత్కారం లభించడం పట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు.