మెగాహీరో వైష్ణవ తేజ్ డెబ్యూ చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి నుండి క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటూనే ఉంది. అనుకునందానికంటే ఎక్కువ బడ్జెట్ కావడం, రీషూట్స్ ఇలా అనేక అవరోధాలను దాటుకుని విడుదలకు సిద్ధమవుతోంది అనగానే లాక్ డౌన్ రావడంతో ఆగిపోయింది. ఇక లాక్ డౌన్ సమయంలో పాటలతో సందడి చేసి మంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ సొంతం చేసుకుంది. లాక్ డౌన్ ఎత్తివేశాక విడుదల సన్నాహాలు మొదలుపెట్టారు నిర్మాతలు.
ఓటీటీల హవా బాగా పెరగడంతో అటు వైపే వెళ్లాలని అనుకున్నారు. కానీ వైష్ణవ్ తేజ్ డెబ్యూ చిత్రం కావడంతో థియేటర్లలోనే రిలీజ్ చేస్తే బాగుంటుందని భావించి ఆ దిశగా ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. ఈ నెలలో సినిమా హాళ్లు ఓపెన్ అవగానే వచ్చే సినిమాల్లో ఇది కూడ ఉంటుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ సినిమాను ఒక ప్రముఖ ఓటీటీ సంస్థకు విక్రయించినట్టు వార్తలొస్తున్నాయి. సినిమా థియేటర్లలో కాకుండా జనవరి నెలలో నేరుగా ఓటీటీ ద్వారా రిలీజ్ అవుతుందనే టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే నిర్మాతల నుండి స్పందన వచ్చే వరకు ఆగాల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర చేశారు.


