పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు 2026 మార్చి నెల ఎంతో స్పెషల్ కానుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ యాక్షన్ డ్రామా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh )ప్రపంచవ్యాప్తంగా మార్చి 26న థియేటర్లలో సందడి చేయనుంది. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందించిన, దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన రెండో సాంగ్‌ను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పేరుతో రానున్న ఈ పాట హై-ఎనర్జీతో సాగుతుందని చిత్ర బృందం పేర్కొంది. దీనికి సంబంధించి హరీష్ శంకర్, చంద్రబోస్ కలిసి దేవిశ్రీని ఎత్తుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న క్రేజ్ దృష్ట్యా, రాబోయే రోజుల్లో మరిన్ని అప్‌డేట్స్ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


