సినీ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తానేంటో నిరూపించుకొని దేశంలోని గొప్ప కళాకారుల్లో ఒకరుగా పేరుగాంచిన యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తాజాగా నటించి, నిర్మించిన సినిమా ‘ఉత్తమ విలన్’. కమల్ స్నేహితుడు రమేష్ అరవింద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య రేపు (మే 1న) ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విడుదలకు ముందే సంచలనాలను నమోదు చేసింది. కమల్ హాసన్‌కు తెలుగు, తమిళ పరిశ్రమలతో పాటు దేశం మొత్తమ్మీదా మంచి మార్కెట్ ఉంది. అయితే ఆయన సినిమాలకు ప్రధానంగా ఎక్కువగా షేర్ వచ్చేది కమల్ సొంత ప్రాంతమైన తమిళ నాడునుంచే అన్నది అందరికీ తెలిసిన విషయమే!
తాజాగా తమిళంలో కమల్ సినిమాకు గల రేంజ్ ఏమిటన్నది మరోసారి ఋజువైంది. ‘ఉత్తమ విలన్’ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదలకు చేపట్టారు. ఈ సినిమా టిక్కెట్లను ఆన్లైన్లో పెట్టిన గంటలోపే సుమారు 9000 టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. తమిళంలో ఓ సినిమాకు ఈ స్థాయి ఆన్లైన్ క్రేజ్ ఉండడం ఇదే మొదటిసారని తమిళ ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక దీంతో సినిమాపై ఏ రేంజ్ అంచనాలున్నాయన్నది ఇట్టే చెప్పేయొచ్చు. కాగా ఈ అంచనాలను సినిమా ఏమేరకు అందుకుంటుందనే విషయం తెలియాలంటే రేపటివరకూ ఆగాల్సిందే. ఇక ఈ సినిమాను తెలుగులో సి. కళ్యాణ్ విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో కమల్ సరసన ఆండ్రియా, పూజా కుమార్‌లు నటించారు.


