తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటీటీ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ ఆఫ్ తెలంగాణ (TTDMODAUT) ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మే 10వ తేదీ (ఆదివారం) సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో తొలిసారిగా డబ్బింగ్ కళాకారులకు “వాగ్దేవి అవార్డ్స్” ప్రదానం చేశారు. వివిధ డబ్బింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులను ఈ వేదికపై సత్కరించారు.
ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్, తెలంగాణ అడిషనల్ లేబర్ కమిషనర్ ఈ. గంగాధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రముఖ సినీ నటులు శివాజీ రాజా, రాజీవ్ కనకాల, కాదంబరి కిరణ్, ప్రభాకర్‌తో పాటు ఓటీటీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు ఏ. ప్రసాదరావు, TTDWTF అధ్యక్షుడు కొయ్యలమూడి రాకేష్ (నాని), మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ ప్రెసిడెంట్ గోగినేని ప్రసాద్, టీవీ డబ్బింగ్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్సీఎం రాజు తదితరులు పాల్గొన్నారు.
యూనియన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ వర్మ, వైస్ ప్రెసిడెంట్ లలితా రాజ్, జనరల్ సెక్రటరీ సీఎన్ గౌతమ్, ట్రెజరర్ పి. వినోద్ కుమార్, జాయింట్ సెక్రటరీ సాహితి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్ శ్యాంసుందర్ రెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యుల పర్యవేక్షణలో ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలువురు సినీ, టీవీ ప్రముఖుల సమక్షంలో డబ్బింగ్ కళాకారుల ప్రతిభను గుర్తిస్తూ అవార్డులు అందించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది.


