రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై వైకుంఠ్ బోను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వసుదేవసుతం’. మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించిన ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం మంగళవారం సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది.
ఒడిశాలోని వాసుదేవుని ఆలయం, అక్కడి బ్రహ్మ పదార్థం చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు దర్శకుడు వైకుంఠ్ బోను తెలిపారు. మణిశర్మ సంగీతం, చివరి 45 నిమిషాల సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. కృష్ణుడి నేపథ్యంతో సాగే ఈ కథ ప్రేక్షకులకు నచ్చుతుందనే ఆశాభావాన్ని హీరో మాస్టర్ మహేంద్రన్ వ్యక్తం చేశారు.
నిర్మాత ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి జిజు సన్నీ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో జాన్ విజయ్, మైమ్ గోపి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. కథను నమ్మి రాజీపడకుండా ఈ సినిమాను నిర్మించినట్లు ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చిత్ర బృందం వెల్లడించింది.


