అన్ని భాషల వారికీ కనెక్ట్ అయ్యే సినిమాలు ఎప్పుడో గానీ రూపొందవు. అలాంటి సినిమాలు రూపొందిన మరుక్షణమే ఆ సినిమాలను రీమేక్ చేయడం కోసం నిర్మాతలు పోటీ పడుతుంటారు. ఆ కోవలో తాజాగా విడుదలైన సినిమా ‘పీకూ’. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తాజా ప్రభంజనం. విడుదలై మూడు వారాలైనా స్టడీ కలెక్షన్లతో 100కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది. ‘విక్కీ డోనార్’, ‘మద్రాస్ కేఫ్’ లాంటి విలక్షణ సినిమాలను తెరకెక్కించిన సుజిత్ సర్కార్ ఈ సినిమాను తెరకెక్కించారు.
బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలతో, బాక్సాఫీస్ కలెక్షన్లతో దూసుకుపోతోన్న ఈ సినిమా తాజాగా తెలుగులో రీమేక్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఓ ప్రముఖ నిర్మాత ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టారట. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం మేరకు అమితాబ్ పాత్రలో వెంకటేష్, దీపికా పాత్రలో సమంతను సంప్రదించారట. తెలుగు మార్కెట్‌లో బాలీవుడ్ స్టైల్ న్యూ ఏజ్ సినిమా ఇప్పటివరకూ విజయం సాధించకపోవడంతో తెలుగు రీమేక్‌ను ఎవరైనా ప్రముఖ దర్శకుడు చేపడితేనే మంచి మార్కెట్ దొరుకుతుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.


