త్వరలోనే రెండు కొత్త సినిమాలతో వెంకటేష్..!

త్వరలోనే రెండు కొత్త సినిమాలతో వెంకటేష్..!

Published on Jun 3, 2015 4:23 PM IST

Venkatesh

‘గోపాల్ గోపాల’ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ తన కొత్త సినిమాను ఇప్పటివరకూ మొదలుపెట్టలేదు. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ‘గోపాల గోపాల’లో వెంకటేష్, పవన్ కళ్యాణ్‌తో పండించిన అర్థవంతమైన కామెడీ తెలుగులోనూ బాగానే వర్కవుట్ అయింది. ఈ సినిమా తర్వాత వెంకీ పలు హిందీ సినిమాల రీమేక్‌లలో నటించనున్నట్లు వార్తలు వచ్చినా, అవేవీ కార్యరూపం దాల్చలేదు. తాజాగా తన కొత్త సినిమా విషయమై వెంకటేష్ ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

హైద్రాబాద్‌లో ఫిల్మ్‌ఫేర్ సౌత్ 62వ అవార్డుల వేడుక కోసం సిద్ధమౌతోన్న ఆ సంస్థ తాజాగా ఆ వేడుక వివరాలని పంచుకునేందుకు ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి వెంకటేష్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేష్ తన తరువాతి సినిమాల గురించి పంచుకున్నారు. జూలై నెలలో తాను నటించబోయే రెండు సినిమాలని అనౌన్స్ చేస్తానని వెంకటేష్ తెలిపారు. ప్రస్తుతం ఆ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే ఈ సినిమాల గురించి పూర్తి వివరాలు తెలియజేస్తామని వెంకటేష్ తెలిపారు.

తాజా వార్తలు