విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో ముచ్చటగా మూడోసారి బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చాటేందుకు వెంకీ-త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించుకుని ఈ చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత వెంకీ తన నెక్స్ట్ చిత్రాన్ని సక్సె్స్‌ఫుల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడితో చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే, ఈ సినిమా షూటింగ్‌లో వెంకటేష్ జాయిన్ అయ్యేందుకు మరికొంత సమయం పడుతుందట. దీంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ నెలలో ‘ఆదర్శకుటుంబం’ చిత్రాన్ని రిలీజ్ చేసి, అటుపై అనిల్ రావిపూడి చిత్రాన్ని కూడా అత్యంత స్పీడ్‌తో ముగించి.. 2027 సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి సినిమాను రిలీజ్ చేయాలని వెంకటేష్ భావిస్తున్నాడు. మరి వెంకీ నిజంగానే ఈ స్పీడ్‌తో సినిమాలు చేస్తే అభిమానులకు తక్కువ టైమ్‌లో డబుల్ ట్రీట్ ఖాయమని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి.


