#VenkyAnil5: అనిల్ రావిపూడి మల్టీస్టారర్ సెట్స్‌లోకి విక్టరీ వెంకటేష్.. కల్యాణ్ రామ్‌తో కలిసి కీలక సీన్ల చిత్రీకరణ!

#VenkyAnil5: అనిల్ రావిపూడి మల్టీస్టారర్ సెట్స్‌లోకి విక్టరీ వెంకటేష్.. కల్యాణ్ రామ్‌తో కలిసి కీలక సీన్ల చిత్రీకరణ!

Published on Jul 7, 2026 12:59 PM IST

టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటేనే థియేటర్లలో నవ్వుల పండగ. ఇప్పుడు దానికి విక్టరీ వెంకటేష్ టైమింగ్, నందమూరి కల్యాణ్ రామ్ మాస్ ఎనర్జీ తోడైతే ఎలా ఉంటుందో చూపించడానికి సరికొత్త మల్టీస్టారర్ మూవీ రెడీ అవుతోంది. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్స్ #VenkyAnil5, #NKRAR2గా పిలుస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల కల్యాణ్ రామ్‌పై ఒక సాంగ్ షూట్ పూర్తి చేసిన చిత్ర యూనిట్, ఇప్పుడు అత్యంత కీలకమైన తదుపరి షెడ్యూల్‌ను మొదలుపెట్టింది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్‌లోకి విక్టరీ వెంకటేష్ తాజాగా అడుగుపెట్టారు. సినిమాలోని ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్న ఈ సుదీర్ఘ షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో ఒక భారీ సెట్ వేశారు. ప్రస్తుతం ఈ సెట్‌లోనే వెంకటేష్, కల్యాణ్ రామ్‌లతో పాటు హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టిలపై కీలకమైన సన్నివేశాలను డైరెక్టర్ అనిల్ రావిపూడి చిత్రీకరిస్తున్నారు. సినిమాలో వెంకటేష్, కల్యాణ్ రామ్ మధ్య వచ్చే సీన్లు, వారి కెమిస్ట్రీ ఈ ఎంటర్‌టైనర్‌కు మెయిన్ హైలైట్‌గా నిలవనున్నాయని టాక్. అనిల్ రావిపూడి తన మార్క్ హ్యూమర్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ సీన్లను అద్భుతంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో వెంకటేష్ సరసన జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటిస్తుండగా, కల్యాణ్ రామ్ జంటగా కృతి శెట్టి నటిస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి అత్యంత భారీ బడ్జెట్‌తో, గ్రాండ్‌గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే.. టాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలను చూస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, ఎ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్న ఈ సినిమాను 2027 సంక్రాంతి పండగ కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కల్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ట్రెడిషనల్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ఇప్పటికే ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు