బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’ (Ramayana). ఈ పౌరాణిక చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో విభీషణుడి పాత్రలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నాడనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా ఈ వార్తలపై విజయ్ సేతుపతి స్పందించాడు. తాను ఈ ప్రాజెక్టులో లేనని.. అసలు ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని విజయ్ సేతుపతి అన్నారు. దీంతో ఈ సినిమాలో ఆయన నటించడం లేదనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాలో రావణుడి పాత్రలో యష్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తుండగా మండోదరిగా కాజల్ అగర్వాల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు.
ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి.


