
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి తెలుగు తెరకు పరిచయమైన యువహీరో సుధీర్ బాబు. ‘ఏ మాయ చేశావే’ సినిమాలో చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమా ద్వారా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా సుధీర్ బాబు హీరోగా నటించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ రేపు (మే 22న) విడుదలవుతోంది. ‘స్వామిరారా’కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై పరిశ్రమలో మంచి అంచనాలే ఉన్నాయి.
ఇక ఈ సినిమాలో హీరో మంచు మనోజ్ ఓ గెస్ట్ రోల్ చేయడం విశేషంగా కనిపిస్తోంది. తెలుగు పరిశ్రమలో ఇప్పుడున్న యువహీరోలంతా కలిసి మెలిసి ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేసుకుంటూ ఫ్రెండ్లీ వాతావరణానికి తెరతీశారు. ఈ క్రమంలోనే ఈ మధ్యే విడుదలైన దొంగాట సినిమాలో ఓ పాట కోసం ఎనిమింది మంది హీరోలు కాలు కదిపి ఆకట్టుకున్నారు. ఇక ఈ కోవలోనే తాజాగా సుధీర్ బాబు సినిమాలో మనోజ్ గెస్ట్ రోల్ చేశారు.
ఈ విషయం గురించి మాట్లాడుతూ.. “మనోజ్ ఫ్రెండ్‌షిప్ కోసం ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు. అతను ఏ క్యారెక్టర్ చేస్తున్నాడు? ఎంతసేపు కనిపిస్తాడన్నది మాత్రం సినిమా చూసే తెల్సుకోండి” అంటూ సుధీర్ బాబు తెలిపారు. చక్రి చిగురుపాటి నిర్మాణంలో తెరకెక్కిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ సినిమాకు నెల్లూరి బోస్ దర్శకుడు. సుధీర్ బాబు సరసన నందిని అనే కొత్త హీరోయిన్ నటిస్తోంది.

