త్రివిక్రమ్ తరువాతి సినిమా ఎవరితో?

త్రివిక్రమ్ తరువాతి సినిమా ఎవరితో?

Published on Apr 11, 2015 2:22 PM IST

trivikram
తన మాటల మ్యాజిక్‌తో, భావోద్వేగపూరిత సన్నివేశాలతో తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు త్రివిక్రమ్. తాజాగా అల్లు అర్జున్ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఈ వారమే విడుదలై మంచి కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందనేది తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. కాగా ఈ సినిమా విడుదలైపోయినందున త్రివిక్రమ్ కొత్త సినిమా ఎప్పుడు మొదలుపెడతారా అన్న ప్రశ్న అప్పుడే మొదలైంది.

ప్రస్తుతానికైతే త్రివిక్రమ్ ఏ సినిమానీ మొదలుపెట్టలేదు. అయితే పవన్ కళ్యాణ్ లేదా మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తారన్న ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది.. ‘కోబలి’ పేరుతో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాను తెరకెక్కించే ఆలోచనను త్రివిక్రమ్ ఇంతకుముందే తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ పరిశోధన సైతం చేశారు. పవన్ కళ్యాణ్‌తో ఈ సినిమా చేయనున్నట్లు అప్పట్లోనే తెలిపారు. అయితే ప్రస్తుతానికి పవన్ కొన్ని ఇతర ప్రాజెక్టులు, జనసేన పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు కూడా వరుస సినిమాలతో మరో సంవత్సరం వరకూ బిజీగా ఉండనున్నారు. దీంతో ఈలోపు మరేదైనా సినిమా పూర్తి చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నారని తెలుస్తోంది.

తనకు ఆప్తమిత్రుడైన సునీల్‌ హీరోగా త్రివిక్రమ్ ఓ సినిమాను తెరకెక్కిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. కమెడియన్‌గా మంచి గుర్తింపు ఉన్న సమయంలోనే పూర్తి స్థాయి హీరోగా షిఫ్టయ్యారు సునీల్. గత కొంతకాలంగా హీరోగా చెప్పుకోదగ్గ హిట్ లేని కారణంగా త్రివిక్రమ్‌తో చేసే సినిమా కలిసివస్తుందనేది సునీల్ ఆలోచనగా తెలుస్తోంది. ఇన్ని రకాల కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో త్రివిక్రం తదుపరి చిత్రమేంటన్నది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే!

తాజా వార్తలు