వరుస ప్లాపుల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చిన సినిమా ‘గబ్బర్ సింగ్’. కంటెంట్ ఉన్నోడికి కట్ ఔట్ చాలు అని దర్శకుడు హరీష్ శంకర్ డైలాగ్ ను నిజం చేస్తూ పవన్ కళ్యాణ్ చెప్పిన తిక్క తిక్క డైలాగులకు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. నిర్మాత ఖజానా నిండింది. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘గబ్బర్ సింగ్ 2’ను అనౌన్స్ చేశాడు పవర్ స్టార్. గత రెండేళ్ళుగా ‘గబ్బర్ సింగ్ 2’ స్క్రిప్ట్ తో కాలక్షేపం చేస్తున్నాడు దర్శకుడు సంపత్ నంది. పవన్ చేత సినిమా ముహూర్తానికి హాజరయ్యేలా చేయగలిగాడు. కనీసం హీరోయిన్ ఎవరో కూడా తేల్చుకోలేని పరిస్థితి.
‘అత్తారింటికి దారేది’ ఘన విజయం తర్వాత రాజకీయాలతో పవన్ బిజీ అయ్యారు. ఎన్నికలు పూర్తయ్యాకా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న పవన్ ‘గోపాల గోపాల’ షూటింగ్లో పాల్గొన్నారు. ‘గోపాల గోపాల’ చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ఇంకా ‘గబ్బర్ సింగ్ 2’ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఒక క్లారిటీ లేదు.
పవన్ కు ఇష్టమైన రాజకీయ నాయకుడు జగ్గారెడ్డి బిజెపిలో చేరి, మెదక్ ఉప ఎన్నికల బరిలో దిగుతున్నారు. ‘గోపాల గోపాల’ షూటింగ్ కంప్లీట్ చేసి జగ్గారెడ్డికి మద్దతుగా పవన్ ఎన్నికల ప్రచారం చేస్తారని సమాచారం. అదే నిజమైతే ‘గబ్బర్ సింగ్ 2’ వర్క్స్ ఇప్పట్లో ప్రారంభం కావు. అభిమానులు మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.


