
తెలుగు సినీ పరిశ్రమ మార్కెట్ ఈమధ్య కాలంలో ఏ స్థాయిలో పెరిగిందో చూస్తూనే ఉన్నాం. గతంలో ఎన్నడూ చూడని రేంజ్ కలెక్షన్స్ ఇప్పుడు తెలుగు సినిమా అన్ని ఏరియాల్లోనూ చూస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాక అమెరికా, కర్ణాటక లాంటి ఇతర ప్రాంతాల్లోనూ తెలుగు సినిమా మార్కెట్ ఘననీయంగా పెరిగింది. ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ సినిమాలను ఈ కొత్త మార్కెట్ పరిధికి తాజా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇక ఒక్క కలెక్షన్స్ పరంగానే కాక టీవీ సాటిలైట్ రైట్స్ పరంగానూ తెలుగు సినిమా ఎన్నడూ చూడని నెంబర్స్ చూస్తోంది.
తాజాగా ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’.. ఇలా పెద్ద హిట్ కొట్టిన సినిమాల సాటిలైట్ హక్కులను విడుదలకు ముందే భారీ మొత్తానికి టీవీ చానల్స్ సొంతం చేసుకున్నాయి. దీంతో టీవీల్లో ఈ సినిమాలు మొదటిసారి ప్రదర్శితమయ్యే సమయాల్లో ఆ సినిమాకు ఏ స్థాయి రెస్పాన్స్ వస్తుందీ అన్నది కూడా బాగా పరిగణలోకి తీసుకోవడం ప్రారంభమైంది. ఈమధ్యే ‘బాహుబలి’ టీవీ ప్రీమియర్ దసరా సీజన్‌లో రాగా, దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సుమారు 21.9 టీఆర్‌పీ రేటింగ్‌తో బాహుబలి సత్తా చాటింది. అయితే ‘మగధీర’ సినిమాపై ఉన్న రికార్డును మాత్రం ‘బాహుబలి’ చెరపలేకపోయింది. ‘మగధీర’ టీవీ ప్రీమియర్‌కు గతంలో 22 రేటింగ్ వచ్చింది.
ఇక ఈ నేపథ్యంలోనే నేడు టీవీలో మొదటి సారి ప్రదర్శితం కానున్న ‘శ్రీమంతుడు’పైకి ఫోకస్ షిఫ్ట్ అయింది. సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా టీవీ ప్రీమియర్‌కు భారీ హైప్ ఉంది. జీ తెలుగులో ఈ సాయంత్రం 6 గంటలకు ‘శ్రీమంతుడు’ సినిమా ప్రదర్శితం కానుంది. మరి ‘బాహుబలి’కి సాధ్యం కాని రికార్డుని టీవీ ప్రీమియర్‌లో మహేష్ ‘శ్రీమంతుడు’ కొడతాడా అన్నది వేచిచూడాలి.

