వరుస ఫైల్యూర్స్ నుండి ధరమ్ తేజ్ పాఠాలు నేర్చుకుంటాడా ?

‘పిల్లా నువ్వులేని జీవితం’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. రెండవ సినిమా ‘రేయ్’ ఫ్లాపైనా ఆ తర్వాత వచ్చిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం’ లాంటి సినిమాలు మంచి విజయాలుగా నిలిచి ఆతన్ని మెగా అభిమానులకు మరింత దగ్గరగా చేశాయి. ఈ బ్యాట్ టు బ్యాక్ విజయాలు ఆయన్ను మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిలబెట్టాయి కూడ.

కానీ గత కొంత కాలంగా ఎదురవుతున్న వరుస పరాజయాలు ఆయన కెరియర్నే ప్రశ్నార్ధకంగా మార్చాయి. 2016 లో వచ్చిన ‘తిక్క’ తో మొదలుకుని వరుసగా వచ్చిన ‘విన్నర్, నక్షత్రం, జవాన్’ నిన్న మొన్న విడుదలైన ‘ఇంటిలిజెంట్’ బాక్సాఫీస్ ముందు భారీ పరాజయాలుగా నిలవడంతో ఇన్నాళ్లు ఆయన కూడగట్టుకున్న ఫేమ్ దెబ్బతింది.

ఈ ఫైల్యూర్ కి గల కారణాల్లో ధరమ్ తేజ్ స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా ఒకటనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అభిమానులు, సినీ విశ్లేషకులు సైతం ఇకనైనా తేజ్ జాగ్రత్తపడి కథా బలమున్న, కెరీర్ ఎదుగుదలకు సహాయపడే సినిమాల్ని ఎంచుకోవటం మంచిదని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తేజ్ కరుణాకరన్ తో ఒక సినిమా చేస్తూ చంద్రశేఖర్ ఏలేటితో ఒక ప్రాజెక్టును పరిశీలిస్తున్నాడు. మరి ఆయన ఈ వరుస పరాజయాల ద్వారా ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారు, ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యారో తెలియాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే.