
కెరీర్ మొదట్లో వరుసగా హిట్ అందుకున్న యంగ్ హీరో వరుణ్ సందేశ్ కి ఆ తరవాత చెప్పుకోదగిన హిట్ లేదు. అయినా సరే వరుణ్ సందేశ్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా బాక్స్ ఆఫీసు వద్ద వరుసగా దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు, కానీ ఫలితం మాత్రం లేకపోయింది. ఈ సారి ఎలా అన్నా విజయం అందుకోవాలని వరుణ్ సందేశ్ చేసిన లవ్ స్టొరీ ‘పడ్డానండి ప్రేమలో మరి’. ఈ సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. వరుణ్ సందేశ్ పడ్డానండి ప్రేమలో మరి కచ్చితంగా సక్సెస్ అవుతుందని అంటున్నాడు.
ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న వరుణ్ సందేశ్ ఓపెన్ గా గతంలో వరుసగా ఫెయిల్యూర్స్ వస్తున్నాయని ఇక నుంచి జాగ్రత్త తీసుకుంటానని తెలియజేశాడు. ‘నా గత సినిమాలు డీ ఫర్ దోపిడీ, నువ్వలా నేనిలా, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ సినిమాలు డిఫరెంట్ జోనర్ ఫిల్మ్స్. ప్రసతుతం తెలుగు ఆడియన్స్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు కోరుకుంటున్నారు. గత సినిమాల విషయంలో తప్పు చేసాను. ఇక నుండి అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటానని, ప్రేక్షకులను మెప్పించే సినిమాలే చేస్తానని’ అన్నాడు. మహేష్ ఉప్పుటూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో వితిక షేరు హీరోయిన్ గా నటించింది.

