
తెలుగు సినిమాల్లో హీరోగా ఓ గుర్తింపు తెచ్చుకున్నాక ఆ తర్వాత ఎక్కే మెట్టే మాస్ అవతారం. మాస్ అవతారమంటే పూర్తి మాస్ క్యారెక్టర్ చేయడం గురించి మాట్లాడడం లేదు. డైలాగ్ డెలివరీలో, లుక్స్‌లో, ముఖ్యంగా డ్యాన్సులు, ఫైట్లలో మాస్ టచ్ ఉండాలి. ఈ విషయంలో కూడా నిరూపించుకుంటే తెలుగు సినీ ప్రేక్షకుల్లోని విభిన్న అభిరుచులున్న వ్యక్తులను ఆకట్టుకోవచ్చు. విభిన్న అభిరుచులున్న ప్రేక్షకులను ఆకట్టుకోవడమంటే మరో మెట్టు ఎక్కినట్టే కదా! ఈ కోవలోనే తాజాగా ఈ మాస్ లుక్స్‌తో తమను తాము కొత్తగా పరిచయం చేసుకోవడానికి ఇద్దరు యువహీరోలు రేపు ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఆ ఇద్దరిలో ఒకరు సందీప్ కిషన్ కాగా మరొకరు నాగ శౌర్య. సరికొత్త కథాంశాల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలతో మెప్పించిన సందీప్ కిషన్ ‘టైగర్’ సినిమాతో మంచి మాస్ టచ్ ఉన్న క్యారెక్టర్‌తో మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. పక్కా కమర్షియల్ పంథాలో సాగే ‘టైగర్’ సినిమాలోని తన లుక్, డైలాగ్ డెలివరీ మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందనే నమ్మకంలో ఉన్నాడు సందీప్ కిషన్. ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకుడు.
ఇక లవర్ బాయ్‌గా మూడు వరుస సినిమాల్లో నటించి మన పక్కింటి కుర్రాడిలా అలరించిన నాగ శౌర్య, ‘జాదూగాడు’తో తనలోని మాస్ యాంగిల్‌ను బయటపెట్టనున్నాడు. చింతకాయల రవి ఫేం యోగేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో తాను ఇప్పటివరకూ చేయనటువంటి మాస్ టచ్ ఉన్న పాత్రలో నాగ శౌర్య కనిపించనున్నాడు. మరి ఈ యువ హీరోల మాస్ లుక్ ప్రయత్నం అనుకున్న టార్గెట్‌ను చేరుతుందా అన్నది తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే!

