సమీక్ష : 100 డేస్ ఆఫ్ లవ్ – స్లో రొమాన్స్!

సమీక్ష : 100 డేస్ ఆఫ్ లవ్ – స్లో రొమాన్స్!

Published on Aug 26, 2016 9:35 PM IST
100 Days of Love review

విడుదల తేదీ : ఆగష్టు 26, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : జీనస్ మహమ్మద్

నిర్మాత : ఎస్. వెంకట రత్నం

సంగీతం : గోవింద్ మీనన్

నటీనటులు : దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్..

దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘ఓకే బంగారం’తో తెలుగులో బాగా పాపులర్ అయిన నిత్యా మీనన్ – దుల్కర్ సల్మాన్‌ల జోడీ, తాజాగా 100 డేస్ ఆఫ్ లవ్ అనే సినిమాతో మెప్పించేందుకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మళయాలంలో గతేడాది విడుదలైన ఈ సినిమా ఇప్పటికి తెలుగులో వచ్చింది. మరి దుల్కర్-నిత్యామీనన్ జోడీ మళ్ళీ ఆకట్టుకుందా? చూద్దాం..

కథ :

రావు గోపాల రావు (దుల్కర్ సల్మాన్) టైమ్స్ సంస్థలో ఓ ఫీచర్ రైటర్‌గా పనిచేస్తూంటాడు. ప్రేమ విఫలమై, కెరీర్ కూడా కాస్త అస్థవ్యస్థంగా ఉన్న అతడికి సావిత్రి (నిత్యా మీనన్) అనే ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. కొద్దికాలంలోనే గోపాల్, సావిత్రి ఒకరికొకరు బాగా దగ్గరవుతారు. అయితే సావిత్రి మాత్రం అప్పటికే రాహుల్ అనే వ్యక్తిని పెళ్ళాడేందుకు సిద్ధపడుతుంది. తాను పెళ్ళిచేసుకునే వాడిలో స్థిరత్వం ఉండాలనుకునే సావిత్రి, నచ్చిన పని చేస్తూ తనలా తానుండాలనుకునే గోపాల్.. వీరిద్దరి ప్రయాణం ఆ తర్వాత ఏయే మలుపులు తిరిగిందీ? అన్నది సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే సెకండాఫ్‍‌లో దుల్కర్ – నిత్యా మీనన్‌ల జర్నీ అనే చెప్పుకోవాలి. అప్పటివరకూ సాదాసీదాగా నడిచే కథను వీరిద్దరి ప్రయాణం మంచి మలుపులు తిప్పుతుంది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా దుల్కర్ నిత్యా మీనన్‌కి ప్రపోజ్ చేసే సీన్, నీ ఒరిజినల్ మనిషిని బయటకు తీయ్ అని చెప్పే సీన్ లాంటివి చాలా బాగున్నాయి. అదేవిధంగా మొదట్నుంచీ చివరివరకూ దుల్కర్, శేఖర్ మీనన్‌ల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ చాలా రిఫ్రెషింగ్‌గా ఉన్నాయి. క్యారెక్టరైజేషన్స్ పరంగా చూస్తే, ప్రతి పాత్రనూ చాలా బాగా తీర్చిదిద్దిన విధానం సినిమాలో చూడొచ్చు.

నిత్యా మీనన్ తన పాత్రలో ఒదిగిపోయి నటించేంది. నిత్యా మీనన్‌ను క్లాసీ యాక్టర్ అని ఎందుకంటారన్నది ఈ సినిమాతో ఆమె మరోసారి ఋజువుచేసింది. దుల్కర్ సల్మాన్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్‌కు ఎక్కడా వంక పెట్టలేం. ఈ ఇద్దరూ చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ను కూడా అద్భుతంగా పండించడంతో సినిమాలో వాళ్ళ క్యారెక్టర్స్ బలమైన ముద్రను సంపాదించుకున్నాయి.

మైనస్ పాయింట్స్ :

అసలు కథ మొదలవ్వడానికి ఇంటర్వెల్ వరకూ ఎదురుచూడాల్సి రావడమే ఈ సినిమాలో అతిపెద్ద మైనస్ పాయింట్. హీరోయిన్‌ను వెతకడంలోనే ఒక భాగం మొత్తం పూర్తవ్వడంతో, ప్రేమకథను సెకండాఫ్‌లో కానీ మొదలుపెట్టలేదు. ఈ సమయంలో వచ్చే సన్నివేశాలు కూడా కొన్ని మళ్ళీ మళ్ళీ వచ్చినట్లు, కొంత బోర్ కొట్టించినట్లు అనిపించాయి. ముఖ్యంగా నిత్యా మీనన్ కూడా ఇంటర్వెల్ వరకూ పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇవ్వకపోవడం మైనస్సే. సెకండాఫ్‌లో నిత్యా మీనన్ – దుల్కర్‌ల రొమాన్స్‌తో సినిమా మళ్ళీ అసలు కథలోకి వచ్చినా అప్పటికే చాలా సమయం కాలయాపన చేశారనిపించింది.

స్లో నెరేషన్‌ను ఈ సినిమాకు మరో మైనస్ పాయింట్‌గా చెప్పుకోవాలి. ప్రేమకథలన్నీ స్లో నెరేషన్‌తోనే చెప్పడానికి దర్శకులెవరైనా ఇష్టపడతారన్నది ఒప్పుకునేదే అయినా, ఈ సినిమా మరీ నెమ్మదిగా నడిచినట్లనిపించింది. 155 నిమిషాల మేర నిడివి ఉన్న ఈ సినిమాలో ఫస్టాఫ్‌లో వచ్చే చాలా సన్నివేశాలు అనవసరమైనవిగానే కనిపించాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా దర్శకుడు జీనస్ మహమ్మద్, అన్ని ప్రేమకథల్లాన్నే తెలిసిన ప్లాట్‌నే ఎంచుకొని దానికి పాత్రల ఆలోచనలు, పరిస్థితులను మార్చి ఈ రొమాంటిక్ కామెడీని సిద్ధం చేశారు. అసలు కథ మొదలవ్వడానికి చాలా టైమ్ తీసుకోవడమే ఇక్కడ రైటింగ్‌లో జరిగిన పొరపాటుగా కనిపించింది. మేకింగ్ పరంగా మాత్రం జీనస్ చాలా చోట్ల మ్యాజిక్ చేశాడు. హృదయం కన్నులతో పాట దగ్గర్నుంచి చాలాచోట్ల మేకింగ్ పరంగా చాలా ప్రయోగాలనే చేశాడు. అయితే ఆ మేకింగ్‌ని అందుకునే స్థాయిలో కథనం లేకపోవడమే నిరుత్సాహపరచే అంశం.

ప్రతీశ్ వర్మ సినిమాటోగ్రఫీకి వంక పెట్టడానికి లేదు. లైటింగ్, షాట్ మేకింగ్.. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండి సినిమా కనులవిందుగా కనిపించడంలో సినిమాటోగ్రఫీ పనితనం చూడొచ్చు. ఎడిటింగ్ నీట్‌గా ఉంది. అయితే కొన్ని రిపీటెడ్ సన్నివేశాలను తీసేస్తే బాగుండుననిపించింది. గోవింద్ మీనన్ సంగీతం బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా బాగున్నాయి.

తీర్పు :

హీరో.. తన ఇష్టాలు, ప్యాషన్ వైపు ప్రయాణిస్తూంటాడు. హీరోయిన్.. తనను ఇష్టంగా చూసుకునే వ్యక్తితో ఓ సెక్యూర్డ్ లైఫ్ కోరుకుంటుంది. అనుకోకుండా ఈ ఇద్దరూ కలుస్తారు, ప్రేమించుకుంటారు. కాకపోతే ఆ ప్రేమలో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇదే కథతో ఇప్పటికే ఎన్ని సినిమాలు వచ్చినా, కొత్తగా ఏదోకటి చెప్పినప్పుడల్లా నడుస్తూనే ఉన్నాయి. ‘100 డేస్ ఆఫ్ లవ్’ కూడా సరిగ్గా ఇదే కథతో వచ్చిన మరో రొమాంటిక్ కామెడీ. కొత్తగా చెప్పాలనుకున్న అంశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నా, అవన్నీ చాలా నెమ్మదిగా నడిచే కథనంలో, ఇంటర్వెల్ వరకూ మొదలుకాని అసలు కథలో పూర్తి స్థాయిలో కనిపించకుండా పోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘100 డేస్ ఆఫ్ లవ్’‍లో రొమాన్స్ ఉంది కానీ, అది చాలా నెమ్మదిగా మొదలై, అంతే నెమ్మదిగా సాగింది.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు