సమీక్ష : ఆ ఐదుగురు – ఫెయిల్ అయిన మరో మంచి స్టొరీ.!

విడుదల తేదీ : 4 జూలై 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకత్వం :అనిల్ జేసన్ గూడూరు
నిర్మాత : సరిత పట్రా
సంగీతం : మంత్ర ఆనంద్
నటీనటులు : వెంకట్, అస్మితా సూద్, క్రాంతి కుమార్..

గతంలో ‘వినాయకుడు’, ‘ఆ నలుగురు’ సినిమాలను అందించిన ప్రేమ్ మూవీస్ బ్యానర్ వారు మరోసారి సోషల్ మెసేజ్ ఉన్న కాన్సెప్ట్ తో తీసిన సినిమా ‘ఆ ఐదుగురు’. చాలా కాలం గ్యాప్ తర్వాత వెంకట్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో అస్మితా సూద్ హీరోయిన్ గా నటించింది. క్రాంతి, తనిష్క్ రెడ్డి, క్రాంతి కుమార్, శశి, కృష్ణ తేజ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి అనిల్ డైరెక్టర్. యూత్ కి బాగా నచ్చుతుందని భావిస్తున్న ఈ చిత్ర టీం అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉందో లేదో అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

ఎన్నికల్లో నూతన పార్టీ పెట్టిన ఐపిఎస్ అధికారి రఘురాం(వాసు) గత 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతూ అవినీతికి పాల్పడుతున్న నాగునీడు(నాగినీడు)ని ఓడించి ముఖ్యమంత్రి అవుతాడు. తను ముఖ్యమంత్రి కాగానే అడ్డదోవ తొక్కుతున్న యువతను సరైన మార్గంలో నడిపించి యువత యొక్క ప్రాముఖ్యత ఈ దేశానికి ఎంత ఉందో చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఎన్.జి.ఎఫ్ (నెక్స్ట్ జనరేషన్ ఫోర్సు)ని స్థాపిస్తాడు. చదువుతో సంబంధం లేకుండా యువతను ఇందులోకి తీసుకొని పదిహేను వారాల పాటు శిక్షణ ఇచ్చి వారిని నిజాయితీగల పోలీస్ ఆఫీసర్స్ గా మార్చడమే ఈ సంస్థ యొక్క ఉద్దేశం.

అందుకోసం ఫస్ట్ చాయిస్ గా 40 మందిని ఎంచుకుంటారు. ఆ 40 మందిలో వచ్చిన ఐదుగురే బ్లాకులో టికెట్ లు అమ్ముకునే అల్తాఫ్(క్రాంతి), సిద్దు(తనిష్క్ రెడ్డి), జాన్(క్రాంతి కుమార్), బలరాం(శశి), క్రిష్(కృష్ణ తేజ). ఈ క్యాంపులో పలు కారణాల వల్ల ఈ ఐదుగురు మంచి ఫ్రెండ్స్ అవుతారు. వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ తోట చక్రవర్తి(వెంకట్) వస్తాడు. చక్రవర్తి ట్రైనింగ్ లో మొత్తం బాచ్ లో ఈ ఐదుగురు మాత్రం వెనుకబడతారు. ఇదిలా ఉంటే నాగునీడు మరియు కృష్ణ మురళి(పోసాని కృష్ణ మురళి) ఎలాగయినా ఈ ఎ.జి.ఎఫ్ ని మూయించడం కోసం సిఎం ని చంపడానికి కూడా ప్లాన్ చేస్తారు. నాగునీడు – కృష్ణ మురళి కలిసి ఎ.జి.ఎఫ్ సంస్థను మూయించడానికి వేసిన ప్లాన్ ఫలించిందా? లేదా? టఫ్ ట్రైనింగ్ లో ఆ ఐదుగురు వారి శిక్షణ పూర్తి చేసుకొని పోలీస్ ఆఫీసర్స్ అయ్యారా? అసలు వీరి జీవితాల వెనుక ఉన్న అసలు కథలు ఏంటి? మరో స్పెషల్ ఆఫీసర్ గా వచ్చిన కిరణ్మయి(అస్మిత సూద్) ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానం మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అంటే డైరెక్టర్ ఎంచుకున్న స్టొరీ లైన్. ఇది మలయాళంలో వచ్చిన ‘పోలీస్ అకాడమీ’ని పోలి ఉంటుంది. ఇకపోతే చాలా రోజుల తర్వాత వెంకట్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేసాడు. ఆ పాత్రకి అతని లుక్, నటన బాగుంది. కానీ వెంకట్ రోల్ చాలా చిన్నది. అలాగే అస్మితా సూద్ గ్లామర్ పరంగా ఓకే. సిఎం పాత్రలో వాసు. మాజీ ముఖ్యమంత్రి పాత్రలో నాగినీడు మెప్పించారు. పోసాని కృష్ణమురళి ఉన్న కాసింతలో నవ్వించాడు.

ఇక చెప్పుకోవాల్సింది ఐదుగురుగా నటించిన వారి గురించి. ఈ ఐదుగురిలో జాన్ పాత్రలో సెంటిమెంట్ పండించిన క్రాంతి కుమార్ నటన కూడా బాగుంది. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ చాలా బాగా చేసాడు. అలాగే అతని ఎపిసోడ్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. అల్తాఫ్ గా చేసిన క్రాంతి నటన బాగుంది. అలాగే అతని పాత్ర మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. కాస్త బొద్దుగా కనిపించే కృష్ణ తేజ, తనిష్క్ రెడ్డి, శశిలు కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు. సినిమా స్టార్టింగ్ మరియు సినిమా క్లైమాక్స్ ఆసక్తికరంగా ఉంది. కొన్ని కీలక సన్నివేశాలకు డైలాగ్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

‘ఆ ఐదుగురు’ సినిమాకి ఎంచుకున్న స్టొరీ లైన్, కొంతమంది నటీనటుల పెర్ఫార్మన్స్ తప్ప మిగతా అన్ని మైనస్ ల కిందకే వస్తాయి. ముందుగా ఈ సినిమాకి ఎంచుకున్న కథ నితిన్ చేసిన ‘హీరో’ సినిమాని పోలి ఉంటుంది. కథలో రాసుకున్న సబ్ ప్లాట్స్ ని సరిగా ఎలివేట్ చేయలేకపోయాడు. తదుపరి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ స్క్రీన్ ప్లే. సినిమా థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ కి ఆవగింజంత ఆసక్తి కూడా కలిగించని విధంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. దానివల్ల ఆడియన్ సీట్లో కూర్చోలేడు. అలాగే ఇదొక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కావడం వల్ల సినిమా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది.

డైరెక్టర్ రాసుకున్న పాయింట్ లోకి చాలా త్వరగా వెళ్ళాడు, కానీ ఆ తర్వాత ఏమి చేయాలో తెలియక సినిమాని క్లైమాక్స్ దాకా సాగదీశాడు. ముఖ్యంగా ఎన్.జి.ఎఫ్ ట్రైనింగ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ వారికిచ్చే ట్రైనింగ్ పార్ట్స్ లో ఒక్కటి కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా లేదు. అలాగే సినిమాలో చాలా లాజిక్ లేని పాయింట్స్ ఉన్నాయి. ఉదాహరణకి – 1. ముఖ్యమంత్రి రోజు వారి కార్యాచరణ డీటైల్స్ ముందు రోజు మాత్రమే డిసైడ్ చేస్తారు. కానీ సినిమాలో రాబోయే నెల రోజులకి ముందే సిఎం పర్యటన వివరాలపై ఫుల్ కాల్షీట్ బుక్ తయారైపోతుందని చూపిస్తారు. 2. రాష్ట్ర వ్యాప్తంగా నిజాయితీ ఉన్న వారు పోలీస్ సెలక్షన్స్ కి రమ్మని పేపర్ లో యాడ్ ఇస్తే కేవలం 40 మందే రావడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి మిస్టేక్స్ చాలానే ఉన్నాయి. అస్మితా సూద్ పాత్ర గ్లామర్ కి తప్ప కథలో ఎందుకు ఉపయోగం లేకుండా పోయింది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకి పనిచేసిన సాంకేతిక విభాగం టీంలో తను తీసుకున్న రెమ్యునరేషన్ కి పర్ఫెక్ట్ గా పనిచేసిన వ్యక్తి అంటే అది సినిమాటోగ్రాఫర్ పిజి విందా మాత్రమే. ఎందుకంటే తనకిచ్చిన లోకేషన్స్ ని చాలా బాగా చూపించాడు. ప్రతి ఫ్రేంని చాలా బాగా సెట్ చేసుకున్నాడు.మ్యూజిక్ డైరెక్టర్ మంత్ర ఆనంద్ అందించిన పాటలు ఓకే, కానీ ఆతని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి పెద్దగా హెల్ప్ కాలేదు. ఎడిటర్ కూసంత కూడా శ్రద్ధ తీసుకోలేదు, దాని వల్ల చాలా సీన్స్ పూర్తిగా ఫినిష్ అవ్వవు. దానివల్ల ఆడియన్స్ నెక్స్ట్ సీన్ కి త్వరగా కనెక్ట్ అవ్వరు. కొన్ని సీన్స్ కి డైలాగ్స్ బాగున్నాయి.

అనిల్ జేసన్ గూడూరు రాసుకున్న కథ బాగుంది కానీ దాన్ని సరిగా ప్రెజెంట్ చేయలేకపోయాడు. ఇకపోతే రాసుకున్న కథనం సినిమా పెద్ద మైనస్. కథ – కథనం ఫెయిల్ అయినప్పుడు డైరెక్టర్ గా కూడా ఫెయిల్ అవుతాడు. అనిల్ కూడా సేమ్ టు సేమ్ దర్శకుడిగా ఫెయిల్ అయ్యాడు. చాలా చోట్ల డైరెక్టర్ గా ఏది ఎలా ప్రెజెంట్ చేయాలా అని బాగా కన్ఫ్యూజ్ అయ్యాడు. అది మనకు తెరపై కనపడుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

గతంలో ప్రేమ్ మూవీస్ బ్యానర్ వారు ‘వినాయకుడు’, ‘ఆ నలుగురు’ లాంటి సినిమాలను అందించారు, కావున ‘ఆ ఐదుగురు’ సినిమా కూడా బాగుంటుంది అనుకోని సినిమాకి వెళ్ళారంటే మాత్రం సినిమా అయ్యే సరికి సినిమాకి ఎందుకు వచ్చామా అని బాగా ఫీలవుతారు. ఈ సినిమాలో చెప్పుకోదగినవి స్టొరీ లైన్, సినిమాటోగ్రఫీ మరియు కొంతమంది నటుల పెర్ఫార్మన్స్. ఇక మిగిలినవన్నీ మైనస్ పాయింట్స్. బోర్ కొట్టినా పర్లేదు మెసేజ్ ఓరియెంతెడ్ సినిమాలు చూస్తాము అనుకునే వారు ఈ సినిమాకి వెళ్ళచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :