Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : ఏజెంట్ భైరవా – మాస్ ఆడియన్స్ వరకు ఓకే

Agent Bhairava movie review

విడుదల తేదీ : జూలై 7, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : భరతన్

నిర్మాత : బెల్లం రామకృష్ణ రెడ్

సంగీతం : సంతోష్ నారాయణన్

నటీనటులు : విజయ్, కీర్తి సురేష్

విజయ్ అంటే తమిళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరో, అయితే అతను నటించిన సినిమాలు కొన్ని తెలుగులో రిలీజ్ అయ్యి హిట్ అయ్యాయి. అందులో తుపాకి కూడా ఒకటి. అందరి తమిళ హీరోల మాదిరి విజయ్ కూడా తెలుగులో సొంత మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దారిలో గత ఏడాది తమిళంలో ‘భైరవ’ పేరుతో వచ్చిన సినిమాని ‘ఏజెంట్ భైరవ’ గా డబ్బింగ్ చేసి రిలీజ్ చేసారు. మరి ఇప్పుడు ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకి ఎంత వరకు రీచ్ అయ్యిందో తెలుసుకుందాం.

కథ :

భైరవ(విజయ్) హైదరాబాద్ లో ఓ బ్యాంకు లో కలెక్షన్ ఏజెంట్ గా ఉద్యోగం చేస్తూ, రౌడీల నుంచి మొండి బకాయిలు వసూలు చేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఓ పెళ్లి వేడుకలో మాధవీలత(కీర్తి సురేష్)ని చూసి ప్రేమించడం మొదలుపెడతారు. ఆమెకి తన ప్రేమ విషయం చెప్పాలని ప్రయత్నించే లోపే కొందరు రౌడీలు ఆమెని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. వారి నుంచి మాధవిని కాపాడిన భైరవ ఆమె చాలా పెద్ద ప్రమాదంలో ఉందని తెలుసుకుంటాడు. ఆ ప్రమాదానికి కారణం పీకే అలియాస్ పిడకల కోటయ్య(జగపతి బాబు) అని తెలుసుకున్న భైరవ పీకే నుంచి మాధవిని ఎలా కాపాడాడు? అసలు మాధవి ఎదుర్కొంటున్న ఆ ప్రమాదం ఏంటి? దానికి భైరవ ఎలా ఫుల్ స్టాప్ పెట్టాడు ? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధానంగా ప్లస్ పాయింట్స్ అంటే కథ.. దర్శకుడు ఎంచుకున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీల కరప్షన్ అనే పాయింట్ కాస్తా సామాజిక కోణంలో అందరికి భాగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఈ కథకి హీరో విజయ్ ఎప్పటిలాగే తన మాస్ పెర్ఫార్మెన్స్ తో బలం తీసుకొచ్చే ప్రయత్నం చేసాడు. సినిమాలో ఉన్న ఫైట్స్ అన్ని కూడా మేగ్జిమమ్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్, అలాగే క్లైమాక్స్ లో హీరో పక్కా ప్లాన్ వేసి విలన్ ని చిన్న సమస్య నుంచి పెద్ద సమస్యలో ఇరికించడం వంటివి మాస్ ఆడియన్స్ కి భాగా కనెక్ట్ అవుతాయి.

ఇక హీరోయిన్ గా కీర్తి సురేష్ తన నటనతో కొంత ఆకట్టుకుంది. అలాగే సినిమాలో ప్రేక్షకుడు ఆశించే వినోదాన్ని దర్శకుడు చాలా వరకు అందించి సినిమాలో చాలా వరకు ప్రేక్షకుడుని నవ్వించే ప్రయత్నం చేసాడు. యధావిధిగా జగపతి బాబు తన విలనిజంతో ఆకట్టుకున్నాడు. అలాగే జగపతి బాబుకు సపొర్టర్ గా చేసిన డేనియల్ బాలాజీ కూడా తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకి మైనస్ అంటే ముందుగా చెప్పాల్సింది సినిమా కథనం.. దర్శకుడు మంచి పాయింట్ ని చెప్పే ప్రయత్నంలో అవసరంలేని చాలా సన్నివేశాలు కథలో భాగంగా రాసుకున్నాడు . సినిమా ప్రారంభం అంతా హీరోని, హీరోయిన్ తో కలపడానికే అన్నట్లు ఉన్నాయి తప్ప కథలో భాగంగా అనిపించవు. చాలా వరకు సన్నివేశాల్లో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే విషయం ఆడియన్స్ కి తెలిసిపోతుంది.

ఇక సినిమాలో పాటల్లో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకుడుని మెప్పించే రీతిలో లేవు. పాటలో సంగీతానికి, తెలుగులో రాసుకున్న లిరిక్స్ సంబంధం లేకుండా సాగుతుంటాయి. సినిమా డబ్బింగ్ లో చాలా వరకు లోపాలు కనిపిస్తాయి. అలాగే సంభాషణలకు, పాత్రల పెదాల కదలికకు సింక్ ఉండదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పాలి.

సాంకేతిక విభాగం :

డబ్బింగ్ చేసిన సినిమా కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ లో నిర్మాత పెద్దగా ఖర్చు పెట్టినట్లు కనిపించలేదు. మరి కాస్త దృష్టి పెట్టి ఉంటే క్వాలిటీ పరంగా కూడా అవుట్ ఫుట్ బాగా వచ్చేది. ఇక దర్శకుడుగా భరతన్ కథ ద్వారా మెప్పించినా, కథనంలో కొత్తదనం చూపించలేకపోయాడు. సినిమా పక్కా మాస్ కమర్షియల్ తరహా లో ఉంటుంది. అయితే పాటల్లో, ఫైట్స్ లో ఆడియన్స్ మూడ్ ని సంగీతం దారుణంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఈ విషయంలో సంతోష్ నారాయణన్ నిరుత్సహపరిచాడనే చెప్పాలి. ఇక తెలుగు ప్రేక్షకులు అతని మోడరన్ మ్యూజిక్ కి అలవాటు పడలేదు. ఎం. సుకుమార్ కెమెరా పనితనం భాగానే ఉంది. ఎడిటింగ్ లో ఇంకా చాలా వరకు కత్తెర వేయడానికి అవకాశం ఉన్న వదిలేసినట్లు అనిపిస్తుంది.

విశ్లేషణ :

‘ఏజెంట్ భైరవ’ సినిమా ద్వారా ఓ మంచి కథని కమర్షియల్ యాంగిల్ లో దర్శకుడు చెప్పాలని చేసిన ప్రయత్నం కొంత వరకు భాగానే అనిపిస్తుంది. అయితే కొత్తదనం కోరుకునే వారికి ఇలాంటి సినిమాలు నచ్చవు. కానీ బి. సి సెంటర్స్ లో మాస్ ఆడియన్స్ కి నచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఆకట్టుకునే ఫైట్స్ తో పాటు, కాస్త వినోదం, సోషల్ మెసేజ్ ఉన్న కథ కలిసి ఉన్న ఈ సినిమాలోని పాటల్ని, కొన్ని అనవసర సన్నివేశాలని భరించగలిగితే మాస్ ఆడియన్సుకు కాస్తఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review


సంబంధిత సమాచారం :