సమీక్ష : అమీ తుమీ – హాయిగా నవ్వుకోవచ్చు

సమీక్ష : అమీ తుమీ – హాయిగా నవ్వుకోవచ్చు

Published on Jun 10, 2017 6:45 PM IST
Ami Thumi movie review

విడుదల తేదీ : జూన్ 9, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : మోహన్ కృష్ణ ఇంద్రగంటి

నిర్మాత : నరసింహారావు

సంగీతం : మణిశర్మ

నటీనటులు : అడివి శేష్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ అవసరాల, ఈషా రెబ్బ, అదితి మ్యాకల్

గతేడాది ‘జెంటిల్మెన్’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈసారి చేసిన చిత్రమే ‘అమీ తుమీ’. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైన్మెంట్ గా రూపొందిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ:

కోటీశ్వరుడైన ఫైనాన్షియర్ (తనికెళ్ళ భరణి) కొడుకు విజయ్ (శ్రీనివాస్ అవసరాల) మాయ (అదితి మ్యాకల్) ను ప్రేమిస్తాడు. కానీ మాయ తండ్రితో ఉన్న మనస్పర్థల కారణంగా భరణి వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోడు. అదే సమయంలో భరణి కూతురు దీపిక (ఈషా రెబ్బ) కూడా అనంత్ (అడివి శేష్) అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. అనంత్ కు పెద్దగా డబ్బు లేనందున వాళ్ళ పెళ్ళికి కూడా భరణి ఒప్పుకోడు. పైగా ఆమెకు శ్రీ చిలిపి (వెన్నెల కిశోర్) తో వివాహం ఏర్పాటు చేస్తాడు.

దీంతో ఈ రెండు ప్రేమ జంటల పెద్దల్ని కాదని ఎలాగైనా ఒకటవ్వాలని ప్రయత్నిస్తాయి. ఆ ప్రయత్నంలో అప్పటికప్పుడు దీపిక వేసిన ఉపాయాలేమిటి ? అవి ఎలా వర్కవుట్ అయ్యాయి ? వీళ్ళ మధ్యలోకి వచ్చిన శ్రీ చిలిపి ఎలా నలిగిపోయాడు ? చివరికి అతని జీవితం ఏమైంది ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి అతి పెద్ద బలం ఎవరంటే నిస్సందేహంగా వెన్నెల కిశోర్ అని చెప్పొచ్చు. శ్రీ చిలిపి అనే అతని పేరు దగగర్నుంచి హాస్యం నిండిన అతని బాడీ లాంగ్వేజ్, మాటలు, నటన చాలా బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా డైలాగ్స్ చెప్పే సమయంలో అతని టైమింగ్ పూర్తి స్థాయిలో వర్కవుట్ అయింది. ఇక కథలో కీలకమైన మరో పాత్ర పని మనిషి కుమారి (శ్యామల దేవి) కూడా చాలా బాగా నటించింది. వెన్నెల కిశోర్ తో కలిసి ఆమె పండించిన హాస్యం కొత్తగా బాగుంది.

అలాగే హీరోయిన్ ఈషా రెబ్బ కూడా తెలంగాణ యాసలో మాట్లాడుతూనే, అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తాను ఎంచుకున్న కామెడీ జానర్ కు సింపుల్ కథతో, ఫన్ నిండిన స్క్రీన్ ప్లేతో, కథకు సరిగ్గా సరిపోయే పాత్రలతో మంచి ఎంటర్టైన్మెంట్ అందించి పూర్తిగా న్యాయం చేశాడు. ఎక్కడా అనవసరమైన, రొటీన్ సన్నివేశాలు, పాటలను కథనంలో ఇరికించకుండా ఆరోగ్యకరమైన హాస్యంతో ఒకే గమ్యం వైపు కథనాన్ని నడిపి మంచి సినిమాను చూసిన భావనను కలిగించారు.

చాలా పాత్రలు పూర్తిగా కథకు సంబంధించినవై, ముఖ్యమైనవై ఉండటం వలన ప్రతి చోట ఆసక్తికరంగానే అనిపించాయి. అలాగే ప్రతి పాత్ర నుండి దర్శకుడు కామెడీని జనరేట్ చేయడంతో సినిమా చూస్తున్న రెండు గంటలు ఎక్కడా కష్టంగా అనిపించలేదు.

మైనస్ పాయింట్స్ :

హీరోయిన్ తండ్రి పాత్ర చేసిన తనికెళ్ళ భరణి కాస్త ఎక్కువ సేపు కనిపించడం, ఓవర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఒకటి రెండు చోట్ల ఇబ్బంది కలిగించింది. కథ మొదట్లో కనిపించిన శ్రీనివాస్ అవసరాల తర్వాతి కథనంలో మంచి ఫన్ ఇస్తాడేమోనని ఆశిస్తే ఆయన పాత్ర నిడివి తక్కువగా ఉండటంతో కాస్తంత నిరుత్సాహం కలిగింది.

ఇక కథకు ప్రధానమైన రెండు ప్రేమ జంటల మధ్య కెమిస్ట్రీ లేకపోవడంతో సినిమాలో రొమాంటిక్ ఫీల్ మిస్సయింది. కథనంలో వెన్నెల కిశోర్ పాత్రను ఇబ్బందిపెట్టే కొన్ని సందర్భాలు కూడా కాస్తంత అసహజంగా అనిపించాయి. అంతేగాక అతని అసిస్టెంట్ పాత్ర కూడా కొన్ని చోట్ల బలవంతంగా దూరిపోయి బరువుగా తోచింది.

సాంకేతిక విభాగం :

నిర్మాత నరసింహారావు తక్కువ బడ్జెట్లో సినిమాను తీసినా ఎక్కడా నిర్మాణ విలువలు తక్కువ స్థాయిలో ఉన్నట్టు అనిపించలేదు. అందుకు కారణం పిజి. విందా అందించిన సినిమాటోగ్రఫీయే అని చెప్పొచ్చు. ఎలాంటి సెట్టింగ్స్ లేకుండా నేచ్యురల్ లొకేషన్లలో చిత్రీకరించిన ప్రతి ఫ్రేమ్ క్లియర్ గా, కలర్ ఫుల్ గా ఉంది. ముఖ్యంగా నటీ నటుల హావ భావాలను క్యాప్చర్ చేసిన తీరు సినిమాకు చాలా బాగా ఉపయోగపడింది.

ఇక దర్శకుడు మోహన్ కృష్ణ తాను తీసుకున్నది సాధారణమైన కథే అయినప్పటికీ దానికి మంచి హాస్యాన్ని జోడించిన విధానం, రాసిన సంభాషణలు, పాత్రలను వాడుకున్న తీరు సినిమాకు ప్రధాన బలంగా నిలిచి మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించాయి. ఇక సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన సిట్యుయేషనల్ మ్యూజిక్ సన్నివేశాలకు, పాత్రల మాటలకు, వాటి హావభావాలకు, సంభాషణలకు బాగా కుదిరింది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది.

తీర్పు:

దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమాకు వచ్చిన ప్రేక్షకులు సహజమైన కామెడీతో రెండు గంటల పాటు హాయిగా నవ్వుకోవాలని చేసిన ప్రయత్నం ‘అమీ తుమీ’ చాలా వరకు ఆ దిశగా సక్సెస్ సాధించింది. దర్శకుడు తయారుచేసిన సింపుల్ స్టోరీ, ఊహాజనితమైన, ఎలాంటి ట్విస్టులు, ఎగైట్మెంట్స్ లేని సరదా స్క్రీన్ ప్లేకి తోడు శ్రీ చిలిపిగా వెన్నెల కిశోర్ పండించిన మంచి కామెడీ, ఇతర పాత్రల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను ఒక హాయిగా నవ్వుకోగలిగే మంచి కామెడీ ఎంటర్టైనర్ గా మలిచాయి.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు