సమీక్ష : అత్తారిల్లు – అత్తారింట్లోనూ అదే బోరింగ్ దయ్యం..!!

సమీక్ష : అత్తారిల్లు – అత్తారింట్లోనూ అదే బోరింగ్ దయ్యం..!!

Published on Sep 19, 2016 4:14 PM IST
Attarillu review

విడుదల తేదీ : సెప్టెంబర్ 19, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : అంజన్ కే కళ్యాణ్

నిర్మాత : అంజన్ కే కళ్యాణ్

సంగీతం : డెన్నిస్‌ నార్టన్‌

నటీనటులు : సాయి రవి కుమార్‌ , అతిథి దాస్‌..

అంతా కొత్త వాళ్ళతో దర్శక, నిర్మాత అంజన్ కే కళ్యాణ్ తెరకెక్కించిన హర్రర్ సినిమాయే ‘అత్తారిల్లు’. ట్రైలర్‌తో బాగానే ఆకట్టుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

రణ్‌దీర్, దయానంద్, కృష్ణమూర్తి ముగ్గురు మంచి మిత్రులు. ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడైన దయానంద్‌కి పెళ్ళంటే విపరీతమైన భయం. ఆ భయం వల్లనే పెళ్ళనేదే చేసుకోవద్దని నిర్ణయించుకుంటాడు. ఇక అతడి ఆలోచనలను ఎలాగైనా మార్చాలన్న ఉద్దేశంతో దయానంద్ తండ్రి.. రణ్‌దీర్, కృష్ణమూర్తిలను పిలిచి దయానంద్‌ను ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి తీసుకెళ్ళి పెళ్ళిపై ఇష్టం కలిగేలా చేయమని కోరతాడు.

దీంతో కథ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండే అత్తారిల్లు అనే కాటేజ్‌కు చేరుతుంది. అక్కడికెళ్ళిన తర్వాత ఈ గ్యాంగ్‌కు విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ పరిస్థితులేంటీ? ఆ పరిస్థితుల వల్ల ఎవరెవరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారూ? ఈ కథలో జ్వాలా అనే అమ్మాయి ఎవరు? అత్తారిల్లు కాటేజ్ కథేంటీ? అన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు సంగీత దర్శకుడు మణిరత్నం అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌నే అతిపెద్ద హైలైట్‌గా చెప్పుకోవాలి. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్లే కొన్ని సాదాసీదా సన్నివేశాలు కూడా బాగానే కనిపించాయి. ఇక అత్తారిల్లు సెటప్, లొకేషన్, హర్రర్ సినిమాకు సరిపడే ఫీల్‌ని తెచ్చేలా బాగా డిజైన్ చేశారు. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే కథలోని అసలైన ట్విస్ట్ బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది.

కొత్తవాళ్ళైనా అందరూ తమ తమ పాత్రల్లో బాగానే నటించారు. ముఖ్యంగా కృష్ణమూర్తిలో పాత్రలో నటించిన నటుడు కొన్నిచోట్ల నవ్వించాడు. ఆర్‍కేవీ అనే డైరెక్టర్ పాత్ర, ఆ పాత్ర స్టైల్, డైలాగ్ డెలివరీ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

అసలు కథ చాలా చిన్నదైనా, ఉన్నంతలో ఫర్వాలేదనుకుంటే దానికి గందరగోళమైన సన్నివేశాలను, ఒక పద్ధతి లేని స్క్రీన్‌ప్లేని జతచేసి అంతా నీరసంగా సినిమాను నడిపించారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ వరకూ కథంతా అర్థం పర్థం లేని సన్నివేశాలతో నడుస్తూ విసుగు తెప్పించింది. ఇక హర్రర్ సినిమా అన్న మాటే గానీ సినిమాలో భయపెట్టే సన్నివేశాలు మచ్చుకు ఒకటి కనిపించలేదు. ఫస్టాఫ్‌లో ట్రై చేసిన అడల్ట్ కామెడీ కూడా నవ్వించేదిగా లేదు. కథలో ఏ ఒక్క పాత్రనూ సరిగ్గా డిజైన్ చేసినట్లు కనిపించలేదు.

ఇక పెళ్ళంటే ఇష్టం లేని ఒక వ్యక్తి రిఫ్రెష్‌మెంట్ కోసం, ఆలోచనలను మార్పించడానికి కథలో ఎంచుకున్న మార్గం కూడా చీప్‌గా ఉంది. ఏదో క్లైమాక్స్‌లో ఇదే విషయంపై హితభోద చేసినా సినిమా అంతా అమ్మాయిల కోసం ఎదురుచూసే పాత్రల ఆలోచనల చుట్టూనే తిరిగింది. హర్రర్ సినిమా అనగానే ఎప్పట్నుంచో చూసి ఉన్న సెటప్‌నే అలాగే వాడుకోవడం కూడా బోర్ కొట్టించింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా దర్శకుడు అంజన్ కళ్యాణ్ ఒక చిన్న కాన్సెప్ట్‌ను బాగానే పట్టుకున్నా దానికి సరిపడా కథను కానీ, బలమైన సన్నివేశాలతో కూడిన స్క్రీన్‌ప్లేని కానీ రాసుకోలేకపోయారు. హర్రర్ సినిమా అన్న పేరే గానీ ఎక్కడా భయపెట్టగలిగే సినిమా లేకపోవడం దర్శకత్వ వైఫల్యంగానే చెప్పొచ్చు. ఒక్క ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ విషయంలో మాత్రం దర్శకుడు బాగానే మెప్పించాడు.

ముందే చెప్పినట్లు మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకపోతే ఈ సినిమా స్థాయి ఇంకా పూర్తిగా పడిపోయి ఉండేది. ఆయన తన స్కోర్‌తో చాలాచోట్ల సినిమాను నిలబెట్టాడు. డెన్నిస్‌ నార్టన్‌ అందించిన పాటలేవీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఎడిటింగ్ కూడా బాగోలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. బడ్జెట్ దృష్ట్యా చూస్తే ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

హర్రర్ కామెడీల్లో సక్సెస్ అయిన సినిమాలన్నింటిలోనూ కొన్నిసార్లు ఒకే ఫార్మాట్‌ కనిపించి ఉండొచ్చు. అయితే ఆయా సినిమాల్లో ఆ ఫార్మాట్‌తోనే సినిమా ఎంతవరకు నవ్వించింది? ఎంతవరకు భయపెట్టిందీ? అన్న అంశాలను బట్టి సినిమాలు సక్సెస్ సాధిస్తాయి. ‘అత్తారిల్లు’ అంటూ వచ్చిన ఈ హర్రర్ కామెడీలో ఇటు హర్రర్ కానీ, అటు కామెడీ కానీ లేకపోవడమే అతిపెద్ద మైనస్. కొన్నిచోట్ల ఫర్వాలేదనిపించే సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లాంటివి ఉన్నంతలో ఈ సినిమాకు ప్లస్. ఒక్క మాటలో చెప్పాలంటే.. గందరగోళమైన సన్నివేశాలతో, ఇటు నవ్వించని, అటు భయపెట్టని అత్తారింట్లోని బోరింగ్ దయ్యమే ఈ సినిమా!

123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు