సమీక్ష : బందూక్ – సందేశాత్మక ఉద్యమ నేపథ్య కథ!

సమీక్ష : బందూక్ – సందేశాత్మక ఉద్యమ నేపథ్య కథ!

Published on Jun 20, 2015 8:38 PM IST
VBandook-review

విడుదల తేదీ : 19 జూన్ 2015

దర్శకత్వం : లక్ష్మణ్ మురారి

నిర్మాత : గుజ్జ యుగంధర్ రావు

సంగీతం : కార్తీక్ కొడగండ్ల

నటీనటులు : మిథున్‌రెడ్డి, చైతన్య మదాడి, కృష్ణచైతన్యజోషి..


తెలంగాణ రాష్త్రం ఏర్పడ్డాక ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కిన మొదటి సినిమా బందూక్. మిథున్‌రెడ్డి, చైతన్య మదాడి, కృష్ణచైతన్యజోషి, అనురూప్, శహెరాభాను తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు లక్ష్మణ్ మురారి దర్శకుడు. బి.బి.ఎస్.స్టూడియో మోషన్ పిక్చర్స్ సంస్థ పతాకంపై గుజ్జ యుగంధర్‌రావు నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ఉద్యమ నేపథ్య కథ ఏ మేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రెండు ప్రధాన అభిప్రాయాలు, సంఘర్షనల మధ్య నడిచే కథే బందూక్. చేనేత కుటుంబంలో పుట్టిన చైతన్య.. ప్రభుత్వాల వైఫల్యం, అవినీతి వల్లే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడనే అభిప్రాయంలో ఉంటాడు. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కేవలం బందూక్(తుపాకి)తోనే సాధ్యమని ఆ పంథాలో వెళుతుంటాడు. ఇక ఇదే క్రమంలో అతనికి తానుండే గురుకులంలో జాగో పేరుతో వీధి, కాలేజీ నాటకాలు వేసే గ్రూప్ పరిచయమవుతుంది.

జాగో గ్రూపులోని మిత్రులంతా ఎవరికివారే తమ కలల్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో పాటు, సమాజానికి తమ వంతుగా ఏదైనా చేయాలని తపిస్తూ ఉంటారు. ఆ సమయంలోనే తెలంగాణ రెండో దశం ఉద్యమం మొదలవ్వడం, వారు ఆ ఉద్యమంలో భాగం కావడం, గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని పోరాడడం చేస్తుంటారు. చైతన్య, బందూక్‌తోనే ఉద్యమ కల నెరవేరుతుందనే అభిప్రాయంలో ఉండగా, జాగో గ్రూప్ అహింసే ఉద్యమానికి ఊపిరి అనే అభిప్రాయంలో ఉంటుంది. ఉద్యమ క్రమంలో ఈ అభిప్రాయాలు, సంఘర్షణలకు దొరికిన సమాధానమే ‘బందూక్’.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్‌పాయింట్ అంటే అది కథాంశమే! అహింసతో చేసే ఉద్యమం, ఆయుధంతో చేసే ఉద్యమం.. ఈ రెండింటి మధ్యనుండే సంఘర్షణను ఒక ఉద్యమ కథను చెప్పడానికి ఉపయోగించిన తీరు బాగా ఆకట్టుకుంటుంది. స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. ఒక యువకుడి ఆవేశాన్ని ఆయుధంతో, ఒక గ్రూపు ఆలోచనను సమాజంతో ముడి పెట్టడం; వాళ్ళ జీవితాల్లోకి ఉద్యమ కథను తీసుకురావడం; అభిప్రాయాల సంఘర్షణ, చివరకు ఉద్యమం చెప్పాలనుకున్న అసలైన విషయం… ఇలా ఉద్యమాన్నే నేరుగా కాకుండా వివిధ కోణాల్లో, అభిప్రాయాల్లో చెప్పడంలో స్క్రీన్‌ప్లే పకడ్బందీగా ఉపయోగపడింది.

నటీనటులంతా బాగానే నటించారు. వాళ్ళ ఆలోచనల్లో వచ్చే మార్పును తమ నటనలో ప్రదర్శించడంలో చాలా చోట్ల సఫలమయ్యారు. తెలంగాణ ఉద్యమంలో, గతంలో జరిగిన రైతాంగ సాయుధ పోరాటంలో రెండిట్లోనూ ఇదే నటీనటులు ఉండడం ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అయ్యే అంశం. ఈ రెండిట్లోనూ వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్‌ను అందరూ బాగానే పండించారు.

సినిమా పరంగా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తం పాత్రలను పరిచయం చేయడం, వాళ్ళ జీవితాల్లోకి ఉద్యమాన్ని తీసుకురావడం లాంటి సన్నివేశాలతో ఒక ఫ్లోలో సాగిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగుంది. సెకండాఫ్ మొత్తం సీరియస్ మోడ్‌లో నడుస్తుంది. సాయుధ పోరాటం ఎపిసోడ్ సెకండాఫ్‌కి మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ అంటే త్వర త్వరగా ముగించిన క్లైమాక్స్, ఒక సెక్షన్ మాత్రమే కనెక్ట్ కాగల కొన్ని సన్నివేశాల గురించి చెప్పుకోవాలి. తాను చేస్తున్న దానిపై పూర్తి క్లారిటీ లేకున్నా, చైతన్య తన పంథాను ఎంచుకున్నాడనే విషయం ముందు నుంచే తెలిసిపోతుంది. పూర్తి క్లారిటీ ఉన్న వ్యక్తి తనది కాని, అందరూ ఆహ్వనించేది అయిన అభిప్రాయంలోకి మారడం అనే కోణంలో ఆలోచించి ఉంటే ఆ పార్ట్ మరింత బాగుండేది.

ఒక అద్భుతమైన ఇంటర్వెల్ ఎపిసోడ్ తర్వాత సెకండాఫ్ కొద్దిసేపు మందగిస్తుంది. మళ్ళీ సాయుధ పోరాటం ఎపిసోడ్ వచ్చే వరకూ సినిమా డల్‌గా సాగిపోతుంది. ఇక ఈ సినిమాకు ఎంచుకున్న కథాంశం అందరికీ కనెక్ట్ అయ్యేదే అయినా, అది ఒక సెక్షన్‌కి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. సాయుధ పోరాటాన్ని సినిమా కథకు కలిపే క్రమంలో మరింత శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ముందుగా దర్శకుడు లక్ష్మణ్ మురారి గురించి చెప్పుకోవాలి. తాను అనుకున్న బేసిక్ పాయింట్‌ను ఒక ఉద్యమ నేపథ్యంలో నడిచే కథలో, అదే ఉద్యమాన్ని కొందరి ఆలోచనల్లో చెప్పడం వంటి విషయాల్లో చాలా వరకు విజయం సాధించారు. సాయుధ పోరాట సన్నివేశాలను తెరకెక్కించిన తీరు దర్శకుడి ప్రతిభకు అద్దం పడతాయి.

సినిమాటోగ్రాఫర్ రెండు భిన్న అభిప్రాయాల మధ్య నడిచే ఉద్యమ కథను చాలా ప్రతిభావంతంగా తెరకెక్కించారు. ఎడిటింగ్ ఫర్వాలేదనేలా ఉంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సంగీతం చాలా బాగుంది. ఉద్యమ సినిమాల్లో నేపథ్య సంగీతం, పాటలు సినిమాకు బలాన్నిస్తాయి. ఆ విషయంలో సంగీత దర్శకుడు కార్తీక్ కొడగండ్ల విజయం సాధించారనే చెప్పాలి.

తీర్పు :

తెలుగులో ఉద్యమ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. ఉద్యమాన్ని సంఘటనల్లా కాక, కథగా చెప్పినపుడే అది ప్రేక్షకుడికి చేరుతుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఓ బలమైన కథాంశం చుట్టూ ఉద్యమ కథను చెప్పిన సినిమా ‘బందూక్’. కథాంశం చుట్టూ అల్లిన కథ, ఆ కథను వివిధ అభిప్రాయాల కోణంలో ఒక్కోలా ఆవిష్కరించడం, సాయుధ పోరాట ఎపిసోడ్ ఈ సినిమాకు బాగా కలిసివచ్చే అంశాలు. ఇక సెకండాఫ్‌లో కొద్దిసేపు సాగదీసినట్లు కనిపించడం, ఒక సెక్షన్ మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉన్న సినిమా కావడం ప్రతికూల అంశాలు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఉద్యమ నేపథ్యంలో కొన్ని అభిప్రాయాలు, సంఘర్షణలను సందేశాత్మకంగా ఓ కథలా చెప్పిన విధానం ఇలాంటి సినిమాలను ఇష్టపడే వారిని బాగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : ఉద్యమ నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాకు ఓ రేటింగ్ నిర్ణయించడం భావ్యంగా ఉండదన్న ఆలోచనతో ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వట్లేదు.
123తెలుగు టీం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు