సమీక్ష : భైరవ గీత – రొటీన్ గా సాగే యాక్షన్ లవ్ స్టోరీ

విడుదల తేదీ : డిసెంబర్ 14, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : ధనుజయ్, ఇర్ర మోర్,రాజా బల్వాడి

దర్శకత్వం : సిద్ధార్థ

నిర్మాత : అభిషేక్ నామా, భాస్కర్ రసీ

సంగీతం : రవి శంకర్

సినిమాటోగ్రఫర్ : జగదీష్ చీకేతి

ఎడిటర్ : అన్వర్ అలీ

నూతన దర్శకుడు సిద్దార్థ దర్శకత్వంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో రూపొందింన చిత్రం ‘భైరవగీత’. కాగా ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం.. ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

రాయలసీమ నేపధ్యంలో సాగే ఓ హింసాత్మక ప్రేమకథ ఈ ‘భైరవగీత’. తక్కువ కులంలో పుట్టిన భైరవ (ధనుంజయ్) ఆ ఊరికి పెద్ద అయిన పెద్ద కులం అయిన సుబ్బా రెడ్డి దగ్గర పని చేస్తుంటాడు. భైరవ తాతల దగ్గర నుంచి ఇలా తరతరాలకు సుబ్బా రెడ్డి కుటుంబానికి బానిసలుగానే ఉంటుంటారు. ఈ క్రమంలో సుబ్బా రెడ్డి కూతురు గీత (ఇర్ర మోర్) పై సుబ్బా రెడ్డి శత్రువులు అటాక్ చేస్తారు.

భైరవ ప్రాణాలకు తెగించి గీతను కాపాడతాడు. దాంతో అన్నీ సినిమాల్లో లాగానే హీరోయిన్ హీరోతో ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమను ఆమె తండ్రి అంగీకరించడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య భైరవ తమ బానిస బతుకులను మార్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? వారి పై ఎలా తిరుగుబాటు చేశాడు ? చివరకి భైరవ మరియు గీత కలుస్తారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో హీరోగా నటించిన ధనుంజయ్ తన పాత్రకు తగ్గట్లు… తన లుక్స్ అండ్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. ముఖ్యంగా హీరోయిన్ ఫాదర్ సుబ్బారెడ్డికి వార్నింగ్ ఇచ్చే సన్నివేశంలో గాని, ప్రీ క్లైమాక్స్ సన్నివేశంలో గాని ధనుంజయ్ చాలా బాగా నటించాడు.

ఇక హీరోయిన్ గా నటించిన ఇర్రా మోర్ కొన్ని బోల్డ్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఇక ఈ రెగ్యూలర్ లవ్ స్టోరీలో బలహీనమైన పాత్రలతో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను పండించడానికి దర్శకుడు బాగానే ప్రయత్నించాడు.

హీరోయిన్ కి ఫాదర్ గా నటించిన నటుడు కూడా బాగా నటించాడు. ఆయన తిడుతూ పలికిన మాటలు బాగానే అలరించాయి. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.

మైనస్ పాయింట్స్ :

దర్శక రచయితలూ రాసుకున్న కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. సినిమాలో మరీ అవసరానికి మించి వైలెన్స్ ఎక్కువైపోయింది. కథలో ప్లో మిస్ అయింది. ఏ సీన్ కి ఆ సీన్ బాగుంది అనిపించినా, ఓవరాల్ గా కథలో మిళితమయ్యి ఉండవు. సరిగ్గా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు.

దీనికి తోడు కథనం కూడా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తరువాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు. మొత్తానికి ఈ రెగ్యూలర్ లవ్ స్టోరీలో బలహీనమైన పాత్రలతో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను పండించడానికి దర్శకుడు కథనంలో అనవసరమైన వైలెన్స్ ను ఫైట్స్ ను పెట్టి విసిగిస్తాడు.

లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో.. ప్రేక్షకులను ఇటు పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచే లవ్ ఉండదు, అటు పూర్తిగా ఆకట్టుకునే యాక్షన్ ఉండదు.

ఓవరాల్ అవసరానికి మించి హింసాత్మక సన్నివేశాలు ఎక్కువైపోవడం, కథ కథనాలు ఆకట్టుకోకపోవడంతో సినిమా ఫలితమే దెబ్బ తింది.

సాంకేతిక విభాగం :

సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నా.. కథ కథనాలు చాలా రెగ్యూలర్ గా సాగుతూ విసిగిస్తాయి. దీనికి తోడు మోతాదుకి మించి హింసాత్మక సన్నివేశాలు ఉన్నాయి. ఇక సంగీత దర్శకుడు సమకూర్చున పాటలు పర్వాలేదనిపిస్తాయి.

ఈ సినిమాకి సినిమాటోగ్రఫీనే హైలెట్ గా నిలుస్తోంది. లొకేషన్స్ అన్ని బ్యూటిఫుల్ విజువల్స్ తో ఆకట్టుకోగా.. కెమెరామెన్ వాటిని తెరకెక్కించిన విధానం కూడా చాల బాగుంది. ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సినిమాలో కథకు అవసరం లేకుండా వచ్చే కొన్ని సీన్స్ ను ట్రిమ్ చేసి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. ఈ చిత్ర నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువులు బాగున్నాయి.

తీర్పు:

యంగ్ డైరెక్టర్ సిద్దార్థ దర్శకత్వంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో రొమాంటిక్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా తెర‌కెక్కిన భైర‌వ‌గీత చిత్రం.. ఒక‌వైపు హింస, ర‌క్త‌పాతం, మ‌రోవైపు ఘాటు రొమాన్స్‌తో గురువు రామ్ గోపాల్ వ‌ర్మ‌కి ఏమాత్రం త‌గ్గ‌లేదు ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్. అయితే వ‌ర్మ స్టైల్ ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం అక్క‌డ‌క్క‌గా కొన్ని స‌న్నివేశాలు ఆక‌ట్టుకున్నా, క‌థ‌, క‌థ‌నం విష‌యంలో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో వెనుక‌బ‌డి పోయింది.

పైగా చంటి, ఒసేయ్ రాములమ్మ చిత్రాల ఛాయలు సినిమాలో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన ధనుంజయ్ తన నటనతో ఆకట్టుకున్నాడ‌నే చెప్పాలి. ఇక ఫైన‌ల్‌గా చెప్పాలంటే.. మేకింగ్ పై పెట్టిన దృష్టి, స్కిప్ట్ పై కూడా పెట్టిన‌ట్టైతే.. భైర‌వ‌గీత ఇంకో రేంజ్‌లో ఉండేది.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :