సమీక్ష : భలే మంచి రోజు – ఎంటర్టైనింగ్ గా సాగే డిఫరెంట్ అటెంప్ట్.

Bhale Manchi Roju telugu review

విడుదల తేదీ : 25 డిసెంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య

నిర్మాత : విజయ్ – శశి

సంగీతం : సన్నీ ఎం.ఆర్

నటీనటులు : సుధీర్ బాబు, వామిక గబ్బి..


ఘట్టమనేని హీరోలు మరియు అభిమానుల సపోర్ట్ తో హీరోగా పరిచయమై, విభిన్న తరహా సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో సుధీర్ బాబు నుంచి వచ్చిన మరో సినిమా ‘భలే మంచి రోజు’. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమా ద్వారా వామిక గబ్బినిహీరోయిన్ గా పరిచయం చేసారు. యంగ్ ప్రొడ్యూసర్స్ అయిన విజయ్ – శశిలు నిమించిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఏ రేంజ్ లో కామెడీతో థ్రిల్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

ప్రేమలో ఫెయిల్ అయిన హీరో రామ్(సుధీర్ బాబు) మరియు పెళ్ళికి సిద్దమైన హీరోయిన్ సీత(వామిక గబ్బి)ల జీవితంలో ఓ రోజు ఏం జరిగింది అన్నదే ఈ భలే మంచి రోజు కథ.. కథలోకి వెళితే ఉండ్రాజవరంలో మరి కొద్ది సేపట్లో పెళ్ళికి సిద్దమవుతున్న సీత పెళ్లి, కానీ పెళ్లి కొడుకు లేచిపోవడంతో ఆగిపోతుంది. అప్పుడే శక్తి(సాయి కుమార్) మనుషులు సీతని కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకొస్తారు. అక్కడి నుంచి కట్ చేస్తే.. రామ్ ని కాదని వేరెవరినో పెళ్లి చేసుకోవడానికి సిద్దమైన మాయ(ధన్య బాలకృష్ణ)ని పెళ్లి పందిరిలో కొట్టడానికి బయలు దేరతాడు. అలా వెళ్తున్న టైంలో రామ్ ఓ వెహికల్ ని గుద్దుతాడు. ఆ సంఘటనలో గుద్దిన కారులో ఉన్న ఉన్న సీత పారిపోతుంది.

దాంతో శక్తి మనుషులు రామ్ ఫ్రెండ్ ఆది(ప్రవీన్)ని వారి దగ్గర పెట్టుకొని సీతని వెతికి తీసుకొచ్చి వారికి అప్పగించి ఆదిని తీసుకెళ్ళమంటారు. దాంతో సీత వేటలో పడిన రామ్, మొదట కిడ్నాపర్స్ అయిన ఈశు – ఆల్బర్ట్ లను కలుస్తాడు. ఇక వారితో రామ్ జర్నీ ఎలా సాగింది. ఫైనల్ గా సీతని పట్టుకున్నారా? సీతని పట్టుకున్నాక రామ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది? సీత వలన రామ్ జీవితంలోకి ఎవరెవరు వచ్చారు? ఫైనల్ గా రామ్ సీతనీ శక్తికి అప్పగించి తన ఫ్రెండ్ ఆదిని కాపాడుకున్నాడా? లేదా? అన్నదే మీరు తెరపై చూసి ఎంటర్టైన్ అవ్వాల్సిన కథ.

ప్లస్ పాయింట్స్ :

క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో కామెడీ చాలా పార్ట్స్ లో బాగా వర్కౌట్ అయ్యింది. అలా అని రెగ్యులర్ స్టైల్ లో పంచ్ డైలాగ్స్ తో కూడిన కామెడీ కాకుండా సందర్భానుసారంగా వచ్చే కామెడీ ఎక్కువగా సినిమాలో ఉండడం వలన ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ పెదవులపై నవ్వు కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా సినిమాని మొదలు పెట్టడం ఆసక్తికరంగా ఉంది. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ ని ఆసక్తికర మలుపులతో బాగానే లాక్కొచ్చాడు. ఇక ఇంటర్వల్ బ్లాక్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక క్లైమాక్స్ 20 నిమిషాలని ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకోవడం సినిమాకి అల్టిమేట్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. ప్రతి ఒక్క పాత్రని రాసుకున్న విధానం, దాన్ని ప్రెజంట్ చేసిన విధానమే సినిమాకి పెద్ద హైలైట్.

ప్రతి సినిమాలోనూ ఓ డిఫరెంట్ రోల్ ట్రై చేస్తున్న సుధీర్ బాబు ఈ సినిమాలో ఓ లవ్ ఫెయిల్యూర్ కుర్రాడిగా కనిపించాడు. చెప్పాలంటే ఇందులో కూసింత కామెడీ టచ్ ఉన్న పాత్ర చేసాడు. చాలా సందర్భాలలో సుదీర్ బాబు హావ భావాలు చాలా మెచ్యూర్ గా ఉంటాయి. ఓవరాల్ గా ఈ సినిమా కథకి సుధీర్ బాబు పూర్తి న్యాయం చేసాడు. పంజాబీ అమ్మాయి అయిన వామిక గబ్బి చూడటానికి ముద్దుగా బొద్దుగా ఉంది. కానీ ఈ అమ్మాయిలోని ఈజ్ & ఎనర్జీ లెవల్స్ మాత్రం సూపర్బ్. తను సినిమాలో చాలా సేపు ఉన్నా ఎక్కువగా మాట్లాడేది మాత్రం మూడు సన్నివేశాలే. ఆ 3 సన్నివేశాల్లో తన డైలాగ్స్ బాగా నవ్విస్తాయి. ముఖ్యంగా ఓ సీన్ లో తను తిట్టే తిట్లు థియేటర్స్ లో నవ్వులు పూయిస్తాయి. ఇక సీనియర్ యాక్టర్ అయిన సాయి కుమార్ విలన్ గా చాలా బాగా చేసాడు. ఇక సినిమా చివర్లో వచ్చే 30 ఇయర్స్ పృధ్వీ సినిమా క్లైమాక్స్ లో పగలబడి నవ్వించేలా చేసాడు. సుధీర్ బాబుకి సపోర్ట్ గా నటించిన ప్రవీణ్, వేణు, శ్రీరామ్, విద్యుల్లేక, పోసాని కృష్ణమురళిలు తమ పాత్రల్లో ఓ మోస్తరుగా నవ్వించారు. పరుచూరి గోపాలకృష్ణ చేసింది మూడు నాలుగు సీన్స్ అయినా తన పాత్ర ద్వారా చెప్పించిన డైలాగ్స్ నవ్విస్తాయి. ధన్య బాలకృష్ణ, చైతన్య కృష్ణలు పరవాలేధనిపించారు.

సినిమా పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ చాలా ఆసక్తిగా, అక్కడక్కడా ఎంటర్టైన్మెంట్ తో బాగా సాగుతుంది. అలాగే ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా సెకండాఫ్ మీద ఆసక్తి పెంచుతుంది. ఇక సెకండాఫ్ తో పాటు సినిమాకే హైలైట్ అయ్యింది క్లైమాక్స్ లో పృధ్వీ చేసిన కామెడీ ఎపిసోడ్. అలా అలా సాగుతున్న సినిమాని ఒక్కసారిగా నవ్విస్తూ పీక్స్ స్టేజ్ కి తీసుకెళ్ళి మంచి ఫీల్ తో సినిమాకి శుభం కార్డ్ వేయడం మస్త్ అనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది, కానీ ఈ సినిమా నెరేషన్ మొదటి నుంచి చాలా స్లోగా సాగుతుంది. కథనంలో ఉన్న కొన్ని ట్విస్ట్ లు కూడా నేరేషన్ స్లో అవ్వడం వలన సూపర్బ్ అనే థ్రిల్ ఫీలింగ్ ని మాత్రం ఇవ్వవు. ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా ముగిసిన తర్వాత సెకండాఫ్ కూడా లానే ఆశిస్తారు, కానీ సెకండాఫ్ మాత్రం బాగా స్లో అవ్వడమే కాకుండా ఏమవుతుందా అనేది తేలిపోతూ ఉంటుంది. సెకండాఫ్ లో క్లైమాక్స్ అయిన ఓ 20 నిమిషాల పార్ట్ తప్ప మీగతా అంతా బోరింగ్ గా అనిపిస్తుంది.

అలాగే సినిమాలో సాంగ్స్ చాలా చాలా ఎక్కువైపోయాయి, దానివలన చాలా సాంగ్స్ కి సందర్భం అనేది సరిగా కుదరలేదు. మెయిన్ గా సినిమా వేగాన్ని తగ్గించి ఉన్న ఫ్లో ని మిస్ చేయడంలో సాంగ్స్ కీ రోల్ పోషించాయి. సెకండాఫ్ లో వేణు – శ్రీరామ్ సాంగ్ అస్సలు అవసరం లేదు. అసలు ఓవరాల్ గా సినిమాలో ఇంకా బెటర్ గా ఫన్ జెనరేట్ చేసే చాన్స్ ఉంది కానీ ఆ స్థాయిలో రాసుకోవడం వలన కామెడీ ఇంకాస్త ఉండాల్సింది అనే ఫీలింగ్ ఆడియన్స్ కి వస్తుంది. లాగే ఈ థ్రిల్లర్ కథలో థ్రిల్స్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. సాయి కుమార్ – ఐశ్వర్యల మధ్య రాసుకున్న ట్రాక్ కాస్త చీప్ గా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ప్రతి ఒక్కరూ దాదాపు చాలా మంచి అవుట్ పుట్ ఇచ్చారు. శాందత్ సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. ఎప్పుడూ కలర్ఫుల్ విజువల్స్ చూస్తున్న తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమా సినిమాటోగ్రఫీ కాస్త కొత్తగా అనిపిస్తుంది. డార్క్ క్రైమ్ కామెడీ మూవీ కావడం వలన వాడిన లొకేషన్స్, ఆ లొకేషన్స్ ని చూపిన విధానం చాలా ఫ్రెష్ ఫీల్ ని ఇస్తుంది. సన్నీ ఎంఆర్ పాటలు బాగున్నాయి, విజువల్ గా చాలా కలర్ఫుల్ గా కూడా ఉన్నాయి. కానీ సందర్భాలే సింక్ అవ్వలేదు. ఇక తను ఇచ్చిన నేపధ్య సంగీతం సినిమాకి చాలా 90% ప్లస్, 10% ఇనుస్ ఎందుకు అంటే కొన్ని చోట్ల డైలాగ్స్ వినపడకుండా తను చేసిన రీ రికార్డింగ్ మాత్రం బాలేదని చెప్పాలి. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ క్రియేట్ చేసిన సెట్స్ మరియు షూట్ కోసం సెలక్ట్ చేసిన లొకేషన్స్ సినిమాకి పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ ఓవరాల్ గా ఓకే ఓకే కానీ సెకండాఫ్ ని ఇంకాస్త ట్రిమ్ చేయడమే కాకుండా చాలా సాంగ్స్ ని లేపేసి ఉంటే సినిమా ఇంకాస్త స్పీడ్ గా ఉండేది. అర్జున్ – కార్తీక్ డైలాగ్స్ బాగున్నాయి.

ఇక నూతన దర్శకుడైన శ్రీరామ్ ఆదిత్య కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం విభాగాలను డీల్ చేసాడు. కథ – చాలా బాగుంది అనుకునేలా లేదు. ఎందుకంటే ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ లో కిడ్నాప్, కామెడీ, థ్రిల్స్ ని ఓకే అనేలా ఉన్నాయి, కానీ థ్రిల్స్ సూపర్బ్ అనేలా రాసుకొని ఉండాల్సింది. కథనం – ఫస్ట్ హాఫ్ పరంగా చాలా బాగా రాసుకున్న శ్రీరామ్ సెకండాఫ్ లో కాస్త తడబడ్డాడు. ఇక డైరెక్టర్ గా నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకోవడంలోనే కాదు, ఓ డీసెంట్, డిఫరెంట్ అటెంప్ట్ సినిమాని అందించడంలో సక్సెస్ అయ్యాడు. పేరుకి లో బడ్జెట్ అయినా హై బడ్జెట్ అనే ఫీలింగ్ కలిగేలా విజయ్ – శశిల నిర్మించారు.

తీర్పు :

రొటీన్ సినిమాలు చూసి చూసి విసిగిపోయి ఉన్న తెలుగు ప్రేక్షకులకు క్రిస్మస్ కానుకగా దొరికిన డిఫరెంట్ అండ్ ఎంటర్టైనింగ్ మూవీ ‘భలే మంచి రోజు’. ఒక రోజులో ఇద్దరి లైఫ్ లో జరిగిన విశేషాలతో అల్లుకుంటూ రాసుకున్న కథ ఆడియన్స్ కి ఆసక్తి కలిగిస్తుంది. అలాంటి కథని దాదాపు ఎంటర్టైనింగ్ గా చెప్పడం బాగుంది. సుధీర్ బాబు – వామికల పెర్ఫార్మన్స్, పలువురు కమెడియన్స్ నవ్వులు, ఆసక్తికర ఫస్ట్ హాఫ్, బాగా నవ్వుకునేలా పృధ్వీ చేసిన క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్. అక్కడక్కడా సాగదీసినట్టు ఉండే ఫీలింగ్, సెకండాఫ్ లో సినిమా స్లో అవ్వడం, పాటలు అవసరం లేకుండా వరుసగా వచ్చేస్తుండడం సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. ఓవరాల్ గా ఈ వీకెండ్ లో డిఫరెంట్ సినిమాలతో పాటు ఎంటర్టైన్మెంట్ సినిమాలను కూడా ఆశించే ప్రేక్షకులు చూడదగిన సినిమా ‘భలే మంచు రోజు’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :