సమీక్ష : భీమవరం బుల్లోడు – మెప్పించలేకపోయిన ఓల్డ్ కామెడీ.!

విడుదల తేది : 27 ఫిబ్రవరి 2014
123తెలుగు .కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకత్వం : ఉదయ శంకర్
నిర్మాతలు : డి. సురేష్ బాబు
సంగీతం : అనూప్ రూబెన్స్
నటినటులు : సునీల్, ఎస్తర్ ..

‘తడాఖా’ సినిమా తర్వాత మళ్ళీ సునీల్ సోలో హీరోగా చేసిన సినిమా ‘భీమవరం బుల్లోడు’. ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉదయ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి. సురేష్ బాబు నిర్మించాడు. సునీల్ సరసన ఎస్తర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. సునీల్ కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్న ఈ సినిమా ఎంత వరకూ ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం…

కథ :

భీమవరంలో నివసించే ఒక మామూలు కుర్రాడు రాంబాబు(సునీల్). ఆ ఊర్లో వాళ్ళందరికీ ఒక సెంటిమెంట్. అతను వచ్చి వాళ్ళింటి అమ్మాయిని పెళ్లి చూపులు చూస్తే ఆ అమ్మాయికి వెంటనే పెళ్లై పోతుంది. అలా అందరి ఇళ్ళకి వెళ్తూ రాంబాబు కాస్త మనీ సంపాదిస్తుంటాడు.

ఒకరోజు రాంబాబుకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలుస్తుంది. ఇక 10 రోజులే బతుకుతాడని తెలుస్తుంది. అందువల్ల తనే ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకుంటాడు. కానీ తనలోని భయాన్ని వీడి తను చనిపోయేలోపు హైదరాబాద్ లోని రౌడీలందరినీ హతమార్చాలి అనుకుంటాడు. అప్పుడు అతని అన్న, పోలీస్ ఆఫీసర్ అయిన పోసాని(పోసాని కృష్ణ మురళి)తో కలిసి రౌడీలను ఏరి పారేయడం మొదలు పెడతారు.

అలా చేయడం వల్ల రాంబాబుకి శత్రువులు పెరుగుతారు. అయినా కాని అతను అందరికీ హెల్ప్ చేస్తుంటాడు. ఆ జర్నీలోనే రాంబాబు నందిని(ఎస్తర్)తో ప్రేమలో పడతాడు. కానీ చెప్పడానికి మాత్రం సంకోచిస్తాడు. అప్పుడే అతనికి బ్రెయిన్ ట్యూమర్ లేదని తెలుస్తుంది. దాంతో మళ్ళీ రాంబాబుని రౌడీలు ఎం చేస్తారా అని భయపడతాడు. అలాగే నందినిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటాడు. అప్పుడు రాంబాబు ఎం చేసాడు? ఎలా రౌడీలను ఎదుర్కొన్నాడు? చివరికి నందినిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

సునీల్ ఎప్పటిలానే తన బ్రాండ్ కామెడీ డైలాగ్స్ మరియు ఎమోషన్స్ తో ఎంటర్టైన్ చెయ్యడానికి బాగా ప్రయత్నించాడు. అలాగే యాక్షన్ సీక్వెన్స్ లు బాగా చేసాడు. ఎస్తర్ చూడటానికి డీసెంట్ ఉంది. మీడియం బడ్జెట్ సినిమాల కతానాయికల్ జాబితాలో చేరే టాలెంట్ ఎస్తర్ లో ఉంది. ఒక కీలక పాత్రలో పోసాని కృష్ణ మురళి బాగా నవ్వించాడు.

శ్రీనివాస్ రెడ్డి, జయప్రకాశ్ రెడ్డి, తాగుబోతు రమేష్ సెకండాఫ్ లో అక్కడక్కడా బాగా నవ్వించారు. సాయాజీ షిండే ఓకే అనిపించాడు. రఘుబాబు, రఘు కరుమంచి పాత్రలు రొటీన్ అయినప్పటికీ బాగా నటించారు. ఓవరాల్ గా కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ఎంచుకున్న కథ చాలా పాతది. చెప్పాలంటే ఈ సినిమా 1980లలో వచ్చి ఉంటే బాగుండేది. ఈ సినిమా తీసిన విధానం కూడా అంత బాలేదు. చాలా సీన్స్ ఏదో బలవంతంగా పెట్టినట్టు, అలాగే ఎక్కడో చూసిన విధంగా ఉంటాయి.

ఈ సినిమాలో చాలా ఎక్కువ ఫైట్ సీక్వెన్స్ లు ఉన్నాయి. సునీల్ లాంటి నటుడికి అన్ని ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టడం అనేది చూడటానికి కాస్త ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఆడియన్స్ సునీల్ ని పవన్ కళ్యాణ్ లేదా ఎన్.టి.ఆర్ లాగా ఊహించుకోలేరు.

మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. పాటలు ఎలా ఉన్నాయి అన్నది పక్కన పెడితే పాటలు వచ్చిన ప్లేస్ మాత్రం చాలా అస్సలు బాలేదు. సునీల్ కూడా కొన్ని చోట్ల చూడటానికి బాలేడు. అతను త్వరగా కాస్త బరువు పెరిగితే బాగుంటుంది.

అలాగే ఈ సినిమా నిడివి కూడా చాలా ఎక్కువ అది కూడా ఒక డ్రా బ్యాక్. సినిమా నిడివి 2 గంటల 15 నిమిషాలు అన్న ఆంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే అనేలా ఉంది. ఎడిటింగ్ సరిగాలేదు, సినిమా ఒక ఫ్లోలో ఉండదు. పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగా అనూప్ రూబెన్స్ ఫెయిల్ అయ్యాడు. శ్రీధర్ సీపాన డైలాగ్స్ లోని పంచ్ లు పెద్దగా పేలలేదు.

డైరెక్టర్ ఉదయ శంకర్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. సినిమా మొత్తం ఫ్లో చాలా స్లోగా ఉండడం, రన్ టైం ఎక్కువ ఉండడం వల్ల ఆడియన్స్ కి బోర్ కొడుతుంది. చాలా మంది కమెడియన్స్ ఉన్నా చెప్పుకోతగ్గ స్థాయిలో కామెడీ లేదు.

తీర్పు :

ఇప్పటికే పలుసార్లు ట్రై చేసిన ఫార్ములాతో వచ్చిన ‘భీమవరం బుల్లోడు’ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాని తీసిన విధానం బాగోలేదు, అలాగే సునీల్ లుక్ కూడా అంత బాలేదు. సినిమా నిడివి ఎక్కువ ఉండడం, ఎంటర్టైన్మెంట్ కూడా సరిగా లేకపోవడం మరియు పాత కాలం స్టొరీ ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్. సెకండాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ తప్ప చెప్పుకోవడానికి ఏం లేని సినిమా ‘భీమవరం బుల్లోడు’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :

More