సమీక్ష : బిచ్చగాడు – ఆలోచింపజేసే ప్రయత్నం!

సమీక్ష : బిచ్చగాడు – ఆలోచింపజేసే ప్రయత్నం!

Published on May 13, 2016 5:25 PM IST
Bichagadu review

విడుదల తేదీ : మే 13, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : శశి

నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోనీ

సంగీతం : విజయ్ ఆంటోనీ

నటీనటులు : విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్, దీపా రామానుజం…


తెలుగులో 1999లో వెంకటేష్ హీరోగా ‘శీను’ అనే సూపర్ హిట్ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు శశి తాజాగా తమిళంలో పిచ్చైకారన్ అనే సినిమాతో మెప్పించారు. ఇప్పుడదే సినిమా బిచ్చగాడు పేరుతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ యువకుడు తన తల్లి ఆరోగ్యం కోసం ఆరు నెలల పాటు భిక్షగాడిగా మారాడని ఓ పుస్తకంలో చదివిన దర్శకుడు శశి, ఈ అంశాన్నే కథగా తీసుకొని బిచ్చగాడుతో వచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందీ? చూద్దాం..

కథ :

అరుల్ సెల్వ కుమార్ (విజయ్ ఆంటోనీ) ఓ కోటీశ్వరుడు. అమెరికాలో చదువు పూర్తి చేసుకున్న ఆరుల్, ఇండియాలో తన తల్లి భువనేశ్వరి (దీపా రామానుజం) నిర్వహిస్తున్న కాటన్ ఇండస్ట్రీస్ ని చూసుకొనేందుకు వస్తాడు. అనుకోకుండా తన ఫ్యాక్టరీ లోనే తన తల్లికి జరిగిన ఓ చిన్న యాక్సిడెంట్ కారణంగా ఆమె కోమాలోకి వెళ్లిపోతుంది. తన తల్లిని తిరిగి మామూలు మనిషి చేయడం కోసం కోసం అరుల్ చాలా హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటాడు. అయినా సరే ఆమె ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాదు. ఆఖరికి ఓ స్వామీజీ 48 రోజులపాటు అరుల్ బిచ్చగాడు గా దీక్ష తీసుకుంటే తల్లి కోమా నుంచి బయట పడే అవకాశం ఉందని చెప్పడంతో అరుల్ భిక్షగాడిగా మారతాడు. ఆ దీక్షలో అతని జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి ? తన కొత్త జీవితంలో తనకి పరిచయమైన వ్యక్తులు ఎవరు ? తన కొత్త జీవితం తనకి నేర్పిన పాఠం ఏమిటి? అరుల్ తల్లి కోమాలో నుంచి బయటపడిందా? లేదా? అన్నది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఇలాంటి ఓ కథాంశంతో సినిమా తియ్యాలి అన్న ఆలోచన వచ్చినందుకు ముందు దర్శకుడు శశి ని అభినందించాలి. అలాగే విజయ్ ఆంటోనీ ని కూడా ఇలాంటి సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నందుకు మెచ్చుకోవాలి. ఈ సినిమాకి డైరెక్టర్ రాసుకున్న కంటెంట్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఎక్కడా ప్రక్కదారి పట్టించకుండా త్వరగా నేరుగానే దర్శకుడు కథ ను ఎత్తుకున్నాడు. ఇక హీరోగా టైటిల్ పాత్రలో నటించిన విజయ్ ఆంటోనీ అటు బిలియనీర్ గా, ఇటు బిచ్చగాడిగా రెండు పాత్రల్లోనూ ఒదిగిపోయాడు. ముఖ్యంగా.. బిచ్చగాడిగా ఉన్నప్పుడు తన తోటి బిచ్చగాళ్లతో ప్రవర్తించే విధానం, కోటీశ్వరుడై ఉండి కూడా బిచ్చగాడిగానే తనను ప్రేమిస్తున్న అమ్మాయిని ఆకట్టుకోవడం వంటి సన్నివేశాల్లో విజయ్ ఆంటోనీ నటన ఆకట్టుకుంటుంది.

మహేశ్వరి పాత్రలో కొత్తనటి సట్నా టైటస్ ఒదిగిపోయింది. తాను ప్రేమించింది ఓ బిచ్చగాడిని కాదని, బిలియనీర్ని అని తెలిసే సన్నివేశంలో, విజయ్ ఆంటోనీని కలుసుకొన్నప్పుడు ఆమె ప్రదర్శించిన హావభావాలు మన మనసుని కదిలిస్తాయి. అలాగే విజయ్ ఆంటోనికి హీరోయిన్ సహాయం చేయడానికి డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోకుండా… భిక్షంగా ఇస్తే తీసుకుంటావా? అన్నప్పుడు విజయ్ ఆంటోనీ ప్రదర్శించిన హావభావాలకు, నటనకు కన్నీళ్ళు రాని ప్రేక్షకుడు ఉండడు. బిచ్చగాళ్ళ కామెడీకి నవ్వకుండా ఉండలేం. అడుక్కునేవాళ్ళ మాట్లాడుకొనే సీన్లు, యఫ్. యం. రేడియో సీన్, ఆడి కారు సీన్స్ లో దర్శకుడు విషాదం అంచున హాస్యం పండించారు. ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమా లో బాగా ఆకట్టుకుంటాయి.

మైనస్ పాయింట్స్ :

తన తల్లి కోసం 48 రోజులు భిక్షగాడిగా దీక్ష తీసుకోవాలని ఓ స్వామీజీ హీరోకి చెప్పడం, హీరో భిక్షగాడిగా మారాలని నిర్ణయించుకోవడం. ఈ కీలకమైన రెండు అంశాలను ప్రేక్షకులకు ఎమోషనల్ అంతగా ఆకట్టుకునేలా తీయలేకపోవడం ప్రధాన మైనస్. ఇదొక్కటే ఈ సినిమాలో అంతగా ఆకట్టుకొని అంశం. అలాగే విజయ్ ఆంటోనీ భిక్షవాడిగా మారాలని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రేక్షకులలో అంతటి కోటీశ్వరుడు ఇలా చేస్తున్నాడేమిటి అన్న బాధ కలిగాలి. కానీ ఆ సన్నివేసాల్ల్లో హాస్యం కనిపించడం చూస్తే ఆ సన్నివేశాల్లో ఎమోషన్స్ కోసం దర్శకుడు మరింత కృషి చేసి ఉండాలనిపిస్తుంది. ఈ సినిమా లో హీరోని, హీరో పెదనాన్నని చంపడానికి రౌడీ గ్యాంగ్ చేసే ప్రయత్నాలు విసుగు తెప్పిస్తాయి . తల్లి ఆరోగ్యం కోసం బిచ్చగాడిగా మారిన కొడుకు కి ఎదురైన సమస్యలేమిటి ? అన్న కథలో రెగ్యులర్ సినిమాలో ఉండే కమర్షియల్ అంశాలు లేవు. మెంటల్ హాస్పిటల్ ఎపిసోడ్ కూడా విసిగిస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల ప్రస్తావనకు వస్తే, భాషాశ్రీ రాసిన మాటలు అద్భుతంగా ఉన్నాయి. సహజంగా ఉన్న మాటలు చాలా చోట్ల మనల్ని ఆలోచింపచేస్తాయి. ఆలాగే హాస్య సన్నివేసాలకోసం రాసిన మాటలు కూడా నవ్వులు పూయించాయి. హీరో విజయ్ ఆంటోనీ ఈ చిత్రానికి అందించిన సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం మాత్రం సన్నివేశానికి తగ్గట్లుగా ఉండటంతో పాటు ఎమోషనల్ సీన్స్ లో వచ్చే రీ రికార్డింగ్ సన్నివేశాల్లో ఉండే ఎమోషన్ ని మరింత ఎక్కువచేస్తుంది. ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. హీరో బిలియనీర్ గా ఉన్నప్పుడు వచ్చే సన్నివేశాలు స్టైలిష్ గా, రిచ్ గా ఉండటంతో పాటు స్లమ్ ఏరియాలో బిచ్చగాళ్ళ చిత్రీకరించిన తీరు చాలా సహాజంగా ఉంటుంది. ఫైట్స్ అయితే చాలా అసహజత్వంగా ఉన్నాయి. ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా బాగున్నాయి.

తీర్పు :

విజయ్ ఆంటోనీ నటించిన ‘బిచ్చగాడు’ చాలా వైవిధ్యమైన సినిమా. అమెరికాలో ఎం.బి.ఏ చదివిన ఓ యువకుడు, ఓ స్వామీజీ చెప్పాడని, కోట్ల ఆస్తి వదిలేసి గుడి దగ్గర బిచ్చమెత్తుకోవడం అన్నది కన్విన్సింగ్‌గా లేకపోవడం అన్న అంశాన్ని పక్కనబెడితే, ఉన్నంతలో ఈ సినిమా నవ్విస్తూ ఆలోచింపజేస్తుంది. కథాంశం, నటీనటుల నటన లాంటి అనుకూలాంశాలున్న ఈ సినిమాలో లాజిక్ పెద్దగా లేకపోవడమన్నది మైనస్. వాణిజ్యాంశాలు లేకపోయినా, ఏదైనా ఆలోచింపజేసే కథనాన్ని, నవ్విస్తూ చెప్పే ప్రయత్నాన్ని చూడాలనుకునే ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు