సమీక్ష : బూచమ్మ బూచోడు – నో హారర్, ఓన్లీ కామెడీ..!

సమీక్ష : బూచమ్మ బూచోడు – నో హారర్, ఓన్లీ కామెడీ..!

Published on Sep 5, 2014 11:00 PM IST
Boochamma-Boochoddu-Movie-r విడుదల తేదీ : 05 సెప్టెంబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.5 /5
దర్శకత్వం : రేవన్ యాదు
నిర్మాత : ప్రసాద్ రెడ్డి, అన్నెంరెడ్డి రమేష్
సంగీతం : శేఖర్ చంద్ర
నటీనటులు : శివాజీ, కైనాజ్ మోతివాలా


‘ప్రేమ కథా చిత్రమ్’, ‘గీతాంజలి’ వంటి హారర్ కామెడీ సినిమాల విజయం తర్వాత తెలుగులో అదే జోనర్లో వచ్చిన మరో సినిమా ‘బూచమ్మ బూచోడు’. శివాజీ, కైనాజ్ మోతివాలా జంటగా నటించిన ఈ సినిమాతో గుణశేఖర్ శిష్యుడు రేవన్ యాదు(యాదగిరి) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హేజెన్ ఎంటర్టైన్మెంట్ & స్నేహ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే..

కథ :

కార్తీక్(శివాజీ) ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. మంచి జీతం, పేరున్న కంపెనీలో జాబ్. తన భార్య శ్రావణి(కైనాజ్ మోతివాలా) బర్త్ డే గిఫ్ట్ గా ఊరు చివర ఒక ఫాంహౌస్ కొంటాడు కార్తీక్. ఒక వారం రోజులు పాటు జాలీగా ఎంజాయ్ చేయాలని ఆ ఫాంహౌస్ లో అడుగుపెడతారు.

సంతోషంగా గడుపుతున్న వారి జీవితంలో అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒకరినొకరు చంపుకోవాలని ప్రయత్నిస్తారు. కట్ చేస్తే మరుక్షణంలో అసలు ఏం జరిగిందో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. అసలు కార్తీక్, శ్రావణి ఎందుకలా ప్రవర్తిస్తున్నారు..? ఆ ఫాంహౌస్ లో అంతక ముందు ఎలాంటి సంఘటనలు జరిగాయి..? అనేదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాతో ‘రాగిణి యంయంఎస్’ ఫేం కైనాజ్ మోతివాలా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. శ్రావణి పాత్రలో కైనాజ్ నటన సినిమాకు ప్రాణం పోసింది. అటు గ్లామర్, ఇటు సీరియస్ సన్నివేశాలలో తనదైన శైలిలో నటించి మెప్పించింది. శ్రావణి పాత్రలో షేడ్స్ ను బాగా ఎలివేట్ చేసింది. కార్తిక్ పాత్రలో శివాజీ పెర్ఫార్మన్స్ ఓకే. తన పాత్రకు న్యాయం చేశాడు.

‘జబర్దస్త్’ కామెడీ షో గ్యాంగ్.. ధనరాజ్, చమ్మక చంద్ర, వేణు, తాగుబోతు రమేష్ చేసిన కామెడీ కొంచం వల్గర్ గా ఉన్నా బి, సి సెంటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వెన్నెల కిషోర్ ఎపిసోడ్ డైలాగులు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయి.

ఇటీవల కాలంలో హారర్ కామెడీ జోనర్లో చాలా సినిమాలు వచ్చాయి. వాటితో పోలిస్తే ఈ సినిమా కాన్సెప్ట్ కొంచం కొత్తగా ఉంది. కాన్సెప్ట్, మెయిన్ లీడ్ పెర్ఫార్మన్స్ తర్వాత సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. లో బడ్జెట్ సినిమా అయినా తెరపై ఒక పెద్ద సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది. సినిమాటోగ్రాఫర్ విజయ్ మిశ్రా అత్యుత్తమ ప్రతిభను కనబరిచాడు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ కొత్తగా ఉంది. అయినా అసలు కథలోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఇంటర్వెల్ ముందు వరకు మెయిన్ స్టొరీ ఏంటో ప్రేక్షకులకు అర్ధం కాదు. అప్పటి వరకు హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలతో సినిమాను సాగదీశాడు. అవి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకునేలా లేవు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ కూడా సరిగా ఎలివేట్ కాకపోవడం మరో మైనస్.

బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి నటించిన సన్నివేశాలు నవ్వించలేదు సరికదా ప్రేక్షకుల సహనానికి పరిక్ష పెట్టాయి, సినిమా నిడివి పెంచాయి. హారర్ కామెడీ సినిమాగా విడుదలైన ‘బూచమ్మ బూచోడు’లో ప్రేక్షకులను భయపెట్టిన సన్నివేశాలు ఒక్కటి కూడా లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా లోబడ్జెట్ సినిమాలలో ‘బూచమ్మ బూచోడు’ పర్వాలేదు అనిపించింది. సినిమాటోగ్రఫీ గురించి ముందుగానే చెప్పాం. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది. శేఖర్ చంద్ర సంగీతం ఓకే. సాయి కృష్ణ కథ రాసుకున్న విధానం బాగుంది. కేవలం హీరో హీరోయిన్లను బేస్ చేసుకుని హారర్ జోనర్ కామెడీలో ఒక కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకులకు అందించాడు.

గుణశేఖర్ వద్ద పలు సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన రేవన్ యాదు(యాదగిరి) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. సినిమాకు పని చేసిన టెక్నీషియన్ల నుండి అత్యుత్తమ ప్రతిభను రాబట్టుకున్నాడు. కాని, ఫస్ట్ హాఫ్ ఎలా నడిపించాలో తెలియక కొంచం తడబడ్డాడు. సినిమాలో హారర్, కామెడీ, సెంటిమెంట్, రొమాన్స్ అన్ని కవర్ చేయాలనుకుని, ఒక్క విభాగానికి కూడా న్యాయం చేయలేకపోయాడు. ముఖ్యంగా హారర్ సన్నివేశాలను డీల్ చేయడంలో ఘోరంగా విఫలం అయ్యాడు. స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేది.

తీర్పు :
హారర్ కామెడీ జోనర్లో కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ‘బూచమ్మ బూచోడు’. కథ బాగున్నా కథనం అతుకుల బొంతలా సాగింది. ప్రేక్షకులను భయపెట్టడంలో విఫలమైనా నవ్వించడంలో మాత్రం కొంత మేర విజయం సాదించారు. హీరోయిన్ కైనాజ్ మోతివాల పెర్ఫార్మన్స్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఎటువంటి అంచనాలు లేకుండా సరదాగా కాసేపు నవ్వుకోవడం కోసం సినిమాకు వెళ్ళొచ్చు.

123తెలుగు. కామ్ రేటింగ్ : 2.5 /5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు