సమీక్ష : దమ్ముంటే సొమ్మేరా – ఫన్ ఉంది కానీ థ్రిల్ మిస్సైంది

 Dammunte Sommera movie review

విడుదల తేదీ : జూన్ 22, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : సంతానం, అంచల్‌ సింగ్

దర్శకత్వం : రామ్ బాలా

నిర్మాత : యన్. రామ స్వామి

సంగీతం : తమన్, కార్తిక్ రాజా

సినిమాటోగ్రఫర్ : దీపక్ కుమార్ పాతి

ఎడిటర్ : గోపి కృష్ణ

సంతానం, అంచల్‌ సింగ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం ‘దిల్లుకు దుడ్డు’ తెలుగులోకి ‘ దమ్ముంటే సొమ్మేరా’ పేరుతో ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ :

శివగంగ పర్వతం అనే కొండ ప్రాంతంలో ఉన్న బంగ్లా గురించి చెప్తుండగా ఈ చిత్రం మొదలవుతుంది. మాయ అనే ఓ యువతి కొన్ని కారణాల వల్ల ఆ బంగ్లాలో సైతాన్ కి తనకి తాను ఆహుతి చేసుకుంటుంది. ఇక అప్పటినుంచి ఆ బంగ్లాలోనే దెయ్యమై తిరుగుతూ అతి భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కుమార్( సంతానం), కాజల్ (అంచల్‌ సింగ్)‌ కి చిన్నప్పటినుంచీ ఒకరంటే ఒకరికి అభిమానం. ఆ అభిమానం కారణంగా పెద్దయ్యాక ఇద్దరు ఒకర్ని ఒకరు ప్రేమించుకుంటారు.

ఆ ప్రేమ వ్యవహారం ఇష్టంలేని కాజల్ తండ్రి కుమార్ కి, కాజల్ కి పెళ్లి చేస్తానని కుమార్ ఫ్యామిలీని నమ్మించి శివగంగ పర్వతంలో ఉన్న బంగ్లాకి తీసుకొని వెళ్లి చంపేద్దాం అని ప్లాన్ చేస్తాడు. మరి బంగ్లాకి వెళ్ళాక వాళ్ళని ఆ దెయ్యం ఏం చేసింది ? ఆ దెయ్యం నుండి కుమార్ తన ప్రేమని, తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు ? అనేదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్:

హార్రర్ జానర్‌కి కామెడీ టచ్‌ ఇస్తే నవ్వించడం చాలా ఈజీ అని తమిళ దర్శకుడు రామ్ బాలా ‘ దమ్ముంటే సొమ్మేరా’ చిత్రంతో మళ్ళీ ప్రూవ్ చేశారు. సినిమాకు హర్రర్ నైపథ్యాన్నే ఎంచుకున్న ఆయన ప్రధానంగా తన దృష్టి మొత్తం నవ్వించడం మీదే పెట్టారు. అందుకోసమే ప్రత్యేకంగా కొన్ని సన్నివేశాలు రాసుకున్నారు. కమెడియన్ రాజేంద్రన్, హీరోని భయపెట్టి చంపడానికి తనే జూనియర్ ఆర్టిస్ట్ లకు దెయ్యాలుగా మేకప్ వేసి రాత్రి పూట ఆ బంగ్లాలో తిప్పుతూ ఉంటాడు.

అయితే అనుకోకుండా నిజంగానే దెయ్యం రావడంతో ఎవరు దెయ్యం ఎవరు మనిషో సినిమాలోని క్యారెక్టర్స్ మధ్య గందరగోళం క్రియేట్ చేసి దర్శకుడు బాగానే నవ్వించాడు. ఫస్ట్ హాఫ్ ను బోర్ కొట్టించిన దర్శకుడు ప్రీ ఇంటర్వెల్ సన్నివేశాలతో సినిమాను పూర్తిగా హార్రర్ జానర్లోకి తీసుకెళ్ళిపోయి, ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ తో సినిమా మీద ఆసక్తి పెరిగేలా చేశారు.

తెలుగు ప్రేక్షకులకి కమెడియన్ గా పరిచయం అయిన సంతానం చిత్రంలో ఎక్కడా పూర్తిస్థాయి హాస్యనటుడిలా కనిపించకుండా అదే విధంగా పూర్తిస్థాయి హీరోలా కనిపించేందుకు ప్రయాసపడకుండా మధ్యస్తంగా కనిపిస్తూ సినిమా బోర్ కొడుతుందన్న ఫీలింగ్ వచ్చే లోపే ఆయన తన కామెడీ టైమింగ్, పంచులతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు. నటుడు రాజేంద్రన్ కంటెంట్ లేని కొన్ని సన్నివేశాల్లో కూడా తన ముద్ర కనబరుస్తూ నవ్వులు పూయించాడు.

మైనస్ పాయింట్స్ :

సినిమా ఆరంభంలో నుండి ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ వరకు చాలా బోర్ కొట్టింది. ఇంటర్వెల్ ముందు సినిమా గనుక ట్రాక్ మారకపోయి ఉంటే తుది ఫలితం దారుణంగా ఉండేది. హీరో పరిచయం, అందుకోసం రూపొందించిన పాట మొదట్లోనే కొంత ఇబ్బంది కలిగించగా హీరో లవ్ ట్రాక్ ఆ ఇబ్బందిని విసుగుగా మార్చింది. హీరో, అతని కుటుంబంపై నడిచే కొన్ని అనవసరమైన సన్నివేశాలు మరీ చికాకు పెట్టాయి.

హీరో హీరోయిన్ల నడుమ రొమాన్స్ అనేదే పండలేదు. కథానాయకిగా నటించిన అంచల్ సింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ అస్సలు ఆకట్టుకోలేదు. సినిమాలో హర్రర్ కామెడీ బాగానే ఉన్నా ఆ హర్రర్ ప్లాట్ మాత్రం రొటీన్ గా చాలా సినిమాల్లో చూసినట్టుగానే ఉంది. సెకండాఫ్ ఫన్ అందిస్తున్నా కథలో తర్వాత ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు తెలిసిపోతూ ఉండటంతో థ్రిల్ లేకుండాపోయింది.

ఇక సినిమా క్లైమాక్స్ కాన్సెప్ట్ కూడ హాలీవుడ్ సినిమా నుండి కాపీ కొట్టిందే. పైగా అందులో నాటకీయత కూడ ఎక్కువగానే ఉంది. దీంతో ఇంగ్లిష్ సినిమాలతో పరిచయం ఉన్న వారికి భారీ నిరుత్సాహం తప్పదు. ఇక మధ్యలో వచ్చే పాటలైతే అస్సలు ఆకట్టుకోలేకపోయాయి. డబ్బింగ్ వెర్షన్ టైటిల్ ‘దమ్ముంటే సొమ్మేరా’ కు సినిమాలో ఎక్కడా జస్టిఫికేషన్ జరగలేదు.

సాంకేతిక విభాగం:

దర్శకుడు రామ్ బాలా ఒక నార్మల్, రెగ్యులర్ కథకి హర్రర్ కంటెంట్ ను జోడించి ద్వితీయార్థం వరకు మంచి ఫన్ ను పండించారు కానీ అర్ధభాగాన్ని బోరింగ్ కథనంతో నింపేసి పూర్తిగా నీరుగార్చేశారు. దీని మూలంగా సినిమా పట్ల పూర్తి సంతృప్తి కలిగించలేకపోయారు.

సంగీత దర్శకుడు యస్ తమన్ అందించిన పాటల సంగీతం అంతగా ఆకట్టుకోలేదు కానీ కార్తీక్ రాజ్ ఇచ్చిన నేపధ్య సంగీతం పర్వాలేదనిపిస్తుంది. బంగ్లాని భయానకంగా చూపించి, మళ్ళీ అదే బంగ్లాలో సెకెండ్ హాఫ్ అంతా జరిగిన ఎక్కడా విజువల్ బ్యూటీ తగ్గకుండా డీవోపి దీపక్ కుమార్ చక్కటి పనితనం కనబర్చారు. ఎడిటర్ ఫస్టాఫ్ పై తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పుంటే బాగుండేది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

హర్రర్ కామెడీ నేపథ్యంలో వచ్చే సినిమాల నుండి అటు కామెడీ, ఇటు హర్రర్ థ్రిల్స్ రెండింటినీ ఆశిస్తారు ప్రేక్షకులు. కానీ ఈ ‘దమ్ముంటే సొమ్మేరా’లో మాత్రం ఫన్ దొరికి థ్రిల్స్ లోపించాయి. పలుసార్లు నవ్వించిన సెకండాఫ్ కామెడీ, సంతానం పంచులు, ఎంటర్టైన్ చేసిన రాజేంద్రన్ పెర్ఫార్మెన్స్ ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు కాగా బోర్ కొట్టించే ఫస్టాఫ్ కథనం, అనవసరమైన సన్నివేశాలు, పేలవమైన ముగింపు లోపాలుగా నిలిచాయి. మొత్తం మీద అన్ని వర్గాల వారిని ఎక్కువగా ఆకట్టుకోలేని ఈ చిత్రం హర్రర్ కామెడీ సినిమాల్ని ఇష్టపడే వారికి మాత్రం కొంత సంతృప్తినిస్తుంది.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

  • 5
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook