సమీక్ష : దర్శకుడు – జస్ట్ ఓకే అంతే

విడుదల తేదీ : ఆగష్టు 04, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : హరి ప్రసాద్ జక్కా

నిర్మాత : సుకుమార్

సంగీతం : సాయి కార్తీక్

నటీనటులు : అశోక్, ఈషా రెబ్బ

సుకుమార్ రైటింగ్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి ‘కుమారి 21 ఎఫ్’ వంటి విభిన్న చిత్రాన్ని అందించిన దర్శకుడు సుకుమార్ నూతన దర్శకుడు హరి ప్రసాద్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘దర్శకుడు’. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

చిన్నప్పటి నుండి దర్శకుడవాలనే తపన ఉన్న కుర్రాడు మహేష్ (అశోక్) ఎట్టకేలకు ఒక సినిమా ఛాన్స్ దక్కించుకుని దాని స్క్రిప్ట్ పనుల్లో ఉంటాడు. అదే సమయంలో అతనికి నమ్రత (ఈషా రెబ్బ) పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది.

కానీ అశోక్ మాత్రం తనలో ఉన్న దర్శకుడి వలన ప్రేమను కూడా సినిమా కోణంలోనే చూస్తుంటాడు. దాంతో హార్ట్ అయిన నమ్రత అతనికి దూరంగా వెళ్ళిపోతుంది. అలా ప్రేమను కోల్పోయిన అశోక్ తాను ప్రాణం పెట్టి డైరెక్ట్ చేసిన సినిమాకు కూడా దూరమైపోతాడు. అలా ప్రేమ, సినిమా రెండింటినీ కోల్పోయిన అశోక్ ఎలాంటి బాధ అనుభవించాడు, అసలతను సినిమాకెందుకు దూరమవాల్సి వచ్చింది, అతనిలోని దర్శకుడికి, ప్రేమికుడికి మధ్య జరిగిన సంఘర్షణ ఎటువంటిది అనేదే తెరపై నడిచే కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో మొదటి నుండి చివరి దాకా ఆకట్టుకునేది హీరో పాత్ర చిత్రీకరణ. సినిమానే జీవితంగా భావిస్తూ, సినిమాలోనే జీవితాన్ని చూసే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, ఎలా ఆలోచిస్తాడు, జీవితంలో జరిగే ప్రతి సంఘటనను, చివరికి ప్రేమను, ప్రేమించిన అమ్మాయిని కూడా సినిమా కోణం నుండే చూస్తూ అన్ని ఎమోషన్స్ ని తన సినిమా కోసం ఎలా వాడుకుంటాడు అనేది బాగా చూపించారు. అలాగే సినిమాలో అండర్ ప్లేగా నడిచే లవ్ ట్రాక్ ఆకట్టుకుంది. హీరోయిన్ ఈషా రెబ్బ సహజమైన నటన లవ్ ట్రాక్ ను ఆడియన్సుకి కనెక్టయ్యే విధంగా చేసింది.

ఇక కథలో కీలకమైన హీరో పాత్రలోని దర్శకుడికి, ప్రేమికుడికి మధ్య నడిచే సంఘర్షణ అవసరామైన అన్ని సందర్భాల్లో కాకపోయినా కొన్ని సన్నివేశాల్లో మాత్రం కనబడింది. ఇంటర్వెల్ సన్నివేశం కొత్తగా స్వార్థపరుడైన దర్శకుడు ఎలా ప్రవర్తిస్తాడు అనే విషయాన్ని బలంగా ఎలివేట్ చేయగలిగింది. అలాగే క్లైమాక్స్ చివర్లో ప్రేమ తాలూకు ఎమోషన్ కదిలించింది. ఇక కమెడియన్ సుదర్శన్ అక్కడక్కడా నవ్వించగా, ప్రియదర్శి కనిపించిన ఒక్క సన్నివేశానికి న్యాయం చేసి నవ్వులు పూయించాడు.

మైనస్ పాయింట్స్ :

కథలో ప్రధాన మైనస్ అంటే దర్శకత్వ లోపమనే చెప్పాలి. డైరెక్టర్ హరిప్రసాద్ జక్కా పేపర్ మీద రాసుకున్నంత బలంగా తెర మీద సినిమానౌ ఆవిష్కరించలేకపోయారని అర్థమవుతోంది. ఆయన ప్రధానంగా చెప్పాలనుకున్న అంశం సినిమాల్ని ప్రాణంగా భావించే ఒక కుర్రాడిలోని దర్శకుడికి, ప్రేమికుడికి మధ్య జరిగే సంఘర్షణను పూర్తి స్థాయిలో ఎలివేట్ చేయలేకపోయారు. దాంతో సినిమాలో సోల్ మిస్సయింది.

అలాగే సినిమా చివర్లో హీరో సినిమాకు, ప్రేమకు దూరమయ్యే ఘట్టాన్ని కూడా ఏదో అలా అలా లాగించేయడంతో పెద్దగా భావోద్వేగం కలగలేదు. అంతేకాకుండా దర్శకుడు అనే టైటిల్ పెట్టినప్పుడు హీరో పడే సినిమా కష్టాల్ని అయినా కొద్దిగా జత చేసుంటే బాగుండేది. అలా కూడా చేయకపోవడంతో కథనంలో బలం కనబడలేదు. ఇక హీరో అశోక్ పర్వాలేదనిపించినా బరువైన ఎమోషన్స్ చూపించాల్సిన చోట తేలిపోవడంతో ప్రేక్షకుడు సినిమాను ఎడాప్ట్ లేకుండా పోయింది.

అలాగే సినిమా అంటే ఇంతే ఇంతే అంటూ ఫస్టాఫ్, సెకండాఫ్ లలో చాలా సన్నివేశాల్ని రొటీన్ గానే తీశారు. మధ్యలో కామెడీ జనరేట్ చేసే ఛాన్స్ ఉన్నా దర్శకుడు వాడుకోలేకపోవడంతో రెగ్యులర్ కమర్షియల్ ఆడియన్సుకు నిరుత్సాహాన్ని కలిగిస్తుంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు హరి ప్రసాద్ జక్కా మంచి అంశాన్నే కథగా ఎంచుకున్నప్పటికీ అనుభవ లోపం వలన బలమైన స్క్రీన్ ప్లే, హత్తుకునే సన్నివేశాలు రాసుకోలేక, నటుల చేత ఎమోషన్స్ పలికించాల్సిన చోట పలికించలేక సినిమాను పేలవంగా తీశారు.

ఇక ప్రవీణ్ అనుమోలు సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. సాయి కార్తీక్ నైపథ్య సంగీతం బాగున్నా పాటలు మాత్రం క్యాచీగా అనిపించలేదు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాత సుకుమార్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

దర్శకుడు హరి ప్రసాద్ జక్కా కొత్తవారవడం మూలాన సినిమాను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా తీయలేకపోయారు. ఆకట్టుకునే లవ్ ట్రాక్, ఈషా రెబ్బ నటన, ఆఖరి 20 నిముషాల ఎమోషన్ ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా ఏమాత్రం ఎలివేట్ కాని సినిమా యొక్క ప్రధానాంశం, భావోద్వేగాల్ని పలికించే సన్నివేశాలు లేకపోవడం, కామెడీ వంటి కమర్షియల్ అంశాలు లేకపోవడం నిరుత్సాహాపరిచే అంశాలు. మొత్తం మీద చెప్పాలంటే ఈ ‘దర్శకుడు’ డైరెక్టర్లోని అనుభవ లోపం వలన దెబ్బ తిన్న ఈ సినిమా

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :