సమీక్ష : దీపావళి – స్లోగా సాగే సింపుల్ ఎమోషనల్ డ్రామా!

సమీక్ష : దీపావళి – స్లోగా సాగే సింపుల్ ఎమోషనల్ డ్రామా!

Published on Nov 11, 2023 11:04 PM IST
 Deepavali Movie Review in Telugu

విడుదల తేదీ : నవంబర్ 11, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: పూ రామన్, కాళీ వెంకట్, దీపన్ తదితరులు.

దర్శకుడు : ఆర్ఏ వెంకట్

నిర్మాత: ‘స్రవంతి’ రవి కిశోర్

సంగీతం: థీసన్

ఎడిటర్: జి ఆనంద్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవి కిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం నేడు రిలీజ్ అయ్యింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

శీనయ్య (పూ రామన్) తన మీనమ్మ (పాండియమ్మ), తన మనవడు గణేష్ (దీపన్)తో లైఫ్ లీడ్ చేస్తుంటాడు. కొన్ని ఆర్థిక ఇబ్బందులతో శీనయ్య కష్ట పడుతూ ఉంటాడు. ఇలాంటి స్థితిలో దీపావళి పండుగ సందర్భంగా తన మనవడికి కొత్త బట్టలు కొని ఇవ్వాలని ఆశ పడతాడు. ఈ క్రమంలో డబ్బులు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా శీనయ్యకి ఎవరూ అప్పు ఇవ్వరు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో తన మనవడు గణేష్ ప్రాణంగా ప్రేమించే మేకను అమ్మేయాలని శీనయ్య నిర్ణయం తీసుకుంటాడు. అది ఇష్టం లేని గణేష్ ఏం చేశాడు ?, ఇంతకీ శీనయ్య మేకను అమ్మాడా ? లేదా ?, చివరకు, ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రమిది కావడం విశేషం. ముఖ్యంగా కథలోని సహజత్వం, వాస్తవిక దృక్పథంతో సాగిన పాత్రల చిత్రీకరణ, అలాగే నటీనటుల నటన ఈ సినిమాలో చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన పూ రామన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగా ఆకట్టుకుంది. ఆయన తన బాడీ లాంగ్వేజ్ తో చాలా బాగా మెప్పించాడు. ముఖ్యంగా శుభలేఖ సుధాకర్ డైలాగ్ డెలివరీతో ఈ పాత్రలోని ఎమోషన్ మరింత బాగా ఎలివెట్ అయ్యింది.

అలాగే మరో కీలక పాత్రలో నటించిన బాలుడు దీపన్ కూడా చాలా బాగా నటించాడు. ఇక ఈ సినిమాలో కర్రోడు మేక పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన పిల్లాడి పాత్ర.. అలాగే వీర స్వామి.. ఆ పాత్ర తాలూకు మటన్ కొట్టు బిజినెస్ ప్లాన్.. ముఖ్యంగా ఈ సినిమా నేపథ్యం.. అదే విధంగా పాత్రల సంఘర్షణ.. ఇలా మొత్తానికి ఈ సినిమాలో గుడ్ మెసేజ్ తో పాటు గుడ్ ఎమోషన్ కూడా ఉంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

ఈ దీపావళి సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శక రచయిత ఆర్ఏ వెంకట్ విఫలం అయ్యారు. స్క్రీన్ ప్లే లో ఎక్కడా ఇంట్రెస్ట్ లేదు. పైగా చాలా చోట్ల కొన్ని కీలక సన్నివేశాలు కూడా చాలా పేలవంగా ఉన్నాయి. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు కథలో క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ బిల్డప్ చేస్తూ ప్లే రాసుకోవాలి. కానీ, ఈ కథలో తర్వాత రాబోయే సీన్ ఏమిటి అనేది సగటు ప్రేక్షకుడికి కూడా క్లారిటీగా అర్ధం అవుతుంది.

ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ గ్రాఫ్ పెరగాలి. కానీ, ఈ సినిమాలో అది కూడా మిస్ అయింది. కథలో టెంపో పెంచకుండా సినిమాని సాగదీస్తూ వెరీ రెగ్యులర్ క్లైమాక్స్ తో ముగించారు. ఇక డబ్బింగ్ డైలాగ్స్ లో కూడా మెరుపులు లేవు. పైగా సింగిల్ ట్రాక్ మీదే దీపావళి మెయిన్ ప్లాట్ మొత్తం సాగడంతో సినిమాలో అదే పెద్ద మైనస్ అయింది. దానికి తోడు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా సింపుల్ గా అనిపిస్తాయి. ఓవరాల్ గా దర్శకుడు ఆర్ఏ వెంకట్ మంచి మెసేజ్ అండ్ ఎమోషన్ అయితే పండించాడు గానీ, కమర్షియల్ యాంగిల్ లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాకపోవచ్చు.

 

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తోంది. ఎడిటింగ్ వర్క్ సినిమాకి తగ్గట్టు ఉంది. సినిమాలో నిర్మాత స్రవంతి రవికిషోర్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

 

తీర్పు :

దీపావళి అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ ఫీల్ గుడ్ డ్రామాలో మెయిన్ కాన్సెప్ట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ మరియు క్లైమాక్స్ బాగున్నాయి. అయితే, ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు సినిమాలో ప్లే బాగా స్లోగా సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఐతే, సహజంగా సాగే కథ, పాత్రలు మాత్రం మెప్పిస్తాయి. కానీ, సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోదు.

 

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు