ఆడియో సమీక్ష : ధృవ – డిఫరెంట్ ఆల్బమ్..!!

ఆడియో సమీక్ష : ధృవ – డిఫరెంట్ ఆల్బమ్..!!

Published on Nov 9, 2016 10:11 PM IST

dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘ధృవ’పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తమిళ హిట్ మూవీ ‘తనీ ఒరువన్’ కు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 2న విడుదలకానున్న ఈ చిత్రం యొక్క ఆడియోని ముందుగానే చెప్పినట్టు నిన్న రాత్రి డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదల చేశారు. ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమీజా సంగీతం అందించారు. మరి మెగా అభిమానులంతా బోలెడు ఆశలు పెట్టుకున్న ఈ ‘ధృవ’ ఆడియో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

1. పాట : ధృవ ధృవ 2
గాయనీ గాయకులూ : అమిత్ మిశ్రా
సాహిత్యం : చంద్రబోస్

సినిమాకి టైటిల్ సాంగ్ అయిన ఈ పాట ఆద్యంతం హీరో పాత్రను పూర్తి స్థాయిలో ఎలివేట్ చేసే విధంగా ఉంది. పాటను వింటుంటే సినిమాలోని కీలక దశలో ఈ పాట వచ్చేలా కనిపిస్తోంది. మొదట ఇంగ్లిష్ పదాలతో మొదలయ్యే ఈ పాటలోని సాహిత్యం విషయానికొస్తే చంద్రబోస్ చేసిన పద ప్రయోగం బాగుంది. భాషలో ఉన్నత స్థాయి ఉన్న పదాలనే ఈ పాటకు ఉపయోగించాడు చంద్రబోస్. ముఖ్యంగా ‘చాణుక్యుడితడు.. మరి చంద్రగుప్తుడితడై’ వంటి పద ప్రయోగం విని అర్థం చేసుకోగలిగే వారికి కాస్త ఆవేశాన్ని కలిగిస్తుంది. ఇక తమీజా సంగీతం కొత్తగా ఉంది. పాట చివర్లో వచ్చే మ్యూజిక్ బీట్ అయితే మంచి ఊపును తెచ్చేలా ఉంది. అమిత్ మిశ్రా గానం చాలా ఫ్రెష్ గా వినడానికి హాయిగా ఉంది.

2. పాట : చూసా చూసా 7
గాయనీ గాయకులూ : పద్మ లత, స్నిగ్గి
సాహిత్యం : చంద్రబోస్

‘చూసా చూసా..’ అంటూ సాగే ఈ పాట ఈ ఆల్బమ్‌లో కాస్త సాధారణంగా కనిపించే పాట. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంత స్థాయి ఈ పాటకు లేదు. హీరోయిన్, హీరో పట్ల తనకున్న ప్రేమను కాస్త ట్రెండీగా చెబితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ పాట. ఈ పాటకు తమీజా అందించిన ట్యూన్ కాస్త రొటీన్‌గానే ఉంది. విజువల్స్‌తో కలిపి చూసినప్పుడు, సినిమా సందర్భానుసారంగా ఈ పాట నచ్చుతుందని ఆశించొచ్చు.

3. పాట : పరేషానురా 3
గాయనీ గాయకులూ : పద్మ లత, విష్ణు ప్రియా
సాహిత్యం : యాదగిరి

ఆల్బమ్ మొత్తం మీద ఈ ‘పరేషానురా.. ‘ అనే పాటే కొత్తగా బాగుంది. ప్యారులో పడిపోతే పరేషానురా.. అంటూ మొదలయ్యే ఈ పాట వెళ్తున్నా కొద్దీ తీవ్రంగా మారుతూ మరింత బలంగా తాకుతుంది. ‘గొడవలు మోసే గుండె నిండా అరుపులురా.. కేకలురా’ లాంటి వెరైటీ వాక్యాలు ఈ పాటలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పద్మ లత వాయిస్ అయితే పాటను మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా చేసింది. తమీజా అందించిన ట్రెడిషనల్ సంగీతం చాలా చాలా కొత్తగా ఉంది. ఒక రకమైన తీయని ప్రేమ ఎడబాటు అనే భావానికి ఈ పాట అద్దం పట్టేలా ఉంది. ఈ పాట అటు మాస్, ఇటు క్లాస్ రెండు వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ ఆల్బమ్‌లో ఇదే బెస్ట్ సాంగ్ అని చెప్పొచ్చు.

4. పాట : నీతోనే డ్యాన్స్ 6
గాయనీ గాయకులూ : హిప్ హాప్ తమీజా, నికిత గాంధీ
సాహిత్యం : చంద్రబోస్

‘నీతోనే డ్యాన్స్ టు నైట్..’ అంటూ సాగే ఈ పాట ఫుల్ ఎనర్జిటిక్ గా సాగే పాటని చెప్పొచ్చు. తమీజా ఈ పాటకు అందించిన ఫాస్ట్ బీట్ మ్యూజిక్ పాట మొత్తంలో హైలెట్. తమీజా గానం షార్ప్ గా ఉండి పాటలో ఉన్న కొద్దిపాటి లిరిక్స్ ను బాగానే ఎలివేట్ చేసింది. ఈ పాట వినగానే ఇందులో ఉన్న లిరిక్స్ వెంటనే హమ్మింగ్ కి వచ్చేస్తాయి. పాట వింటుంటే విజువల్ గా చరణ్ తన డ్యాన్స్ ల విశ్వరూపాన్ని చూపించాడని ఇట్టే అర్థమవుతోంది. ఆల్బమ్ ఆఖరులో ఉన్న ఈ పాట అటు మాస్ ని ఇటు క్లాస్ ని సమానంగా ఆకట్టుకునేలా ఉంది. విజువల్స్‌తో కలిపి చూసినప్పుడు ఈ పాటకూ ఆల్బమ్‌లో మంచి స్థానం ఇవ్వొచ్చు.

తీర్పు :

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలంటే అభిమానులకు ఫస్ట్ లుక్ విడుదల దగ్గర్నుంచి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకూ అన్నింటికీ పండగ వాతావరణ తెచ్చేస్తుంటారు. ఇక సినిమా విజయంలో కీలక పాత్ర పోషించే ఆడియో విషయమైతే చెప్పనక్కర్లేదు. అంచనాలు మరీ ఎక్కువగా ఉంటాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ధృవ విషయంలోనూ ఆడియోపై మొదట్నుంచీ ఎక్కడిలేని అంచనాలున్నాయి. ఆ అంచనాల మధ్యనే విడుదలైన ఈ ఆల్బమ్ రెగ్యులర్ తెలుగు సినిమా స్టైల్ ఆడియోకు భిన్నంగా డిఫరెంట్‌గా ఉంది. కేవలం నాలుగే పాటలున్న ఈ ఆడియోలో ‘పరేశానురా’, ‘నీతోనే డ్యాన్స్’, ‘ధృవ’ పాటలు ఆకట్టుకునేవిగా చెప్పుకోవచ్చు. ‘చూసా చూసా’ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. చివరగా, ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘ధృవ’ ఆల్బమ్ ఎక్కువ క్లాసీగా, రొటీన్‌కు కాస్త భిన్నంగా, సిట్యుయేషన్స్‌కి తగ్గట్టున్న ఆల్బమ్ అని చెప్పొచ్చు. ఆడియోగా కన్నా, ఈ పాటలన్నీ సినిమాతో చూస్తే ఎక్కువ ఆకట్టుకునేవని ఆశించొచ్చు.

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు