ఆడియో సమీక్ష : దిక్కులు చూడకు రామయ్య – కీరవాణి మోడ్రన్ ఆల్బమ్..

గ్రాఫికల్ మానియా ‘ఈగ’ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయి కొర్రపాటి ఆ తర్వాత కథా బలం ఉన్న సినిమాలు ఎంచుకుంటూ చేసిన అందాల రాక్షసి, లెజెండ్, ఊహలు గుసగుసలాడే సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు అదే ప్రొడక్షన్ లో ఈ సంవత్సరం వస్తున్న మూడవ సినిమా ‘దిక్కులు చూడకు రామయ్య’. నాగ శౌర్య, సన జంటగా నటించిన ఈ మూవీ ద్వారా త్రికోటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో నిన్న విడుదలైంది. 6 పాటలున్న ఈ ఆల్బం ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

1. పాట : దింతాన

గాయకుడు : రాహుల్ సిప్లిగంజ్

సాహిత్యం : అనంత్ శ్రీరామ్
‘దిక్కులు చూడకు రామయ్యా’ ఆల్బంలో ‘దింతానా’ అంటూ సాగే మొదటి పాట చాలా జోష్ ఫుల్ గా ఉంది. ఈ పాత వినగానే ప్రతి ఒక్కరికీ నచ్చేస్తుంది. సినిమాలో నాగ శౌర్య, అజయ్ మరియు ఇంద్రజ పాత్రలను మరియు ఈ మూవీ స్టొరీ లైన్ ని చెబుతూ సాగే ఈ పాటలో అనంత్ శ్రీ రామ్ రాసిన సాహిత్యం అందరినీ ఆకట్టుకుంటుంది. రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటని చాలా బాగా పాడాడు. ముఖ్యంగా చరణాల్లో ఒక్కో తరహా వాయిస్ తో పాటలో ఫీల్ ని మరింత పెంచాడు. ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన ఈ పాటకి బాగా సెట్ అయ్యింది. బీట్స్, గజల్స్ ని ఈ పాత సాహిత్యానికి సరిపోయేలా బాగా మిక్స్ చేసారు. ముఖ్యంగా పాట మధ్యలో వచ్చే ఉయ్ అనే సౌంగ్ బాగుంది. ఈ ఆల్బంలో ది బెస్ట్ ఎంటర్టైన్ సాంగ్ అవుతుంది.

2. పాట : చెంబిస్త్రి

గాయకుడు : రేవంత్

సాహిత్యం : అనంత్ శ్రీరామ్

ఈ ఆల్బంలో వచ్చే మరో సోలో సాంగ్ ‘చెంబిస్త్రి’. ఈ సాంగ్ స్టార్టింగ్ వెస్ట్రన్ స్టైల్లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కీరవాణి ఫుల్ బీట్స్, ఎలక్ట్రిక్ గిటార్స్ తో కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి రేవంత్ వాయిస్ బాగా సెట్ అయ్యింది. హీరో క్యారెక్టర్ ని ప్రతిబించేలా ఉండేలా అనంత్ శ్రీరామ్ సాహిత్యం రాసారు. రెండున్నర నిమిషాల ఈ షార్ట్ సాంగ్ ఇప్పుడున్న యువతని బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది.

3. పాట : తేలిపోతున్నా

గాయని : రమ్య బెహార

సాహిత్యం : అనంత్ శ్రీరామ్

ఈ ఆల్బంలోని మూడవ సాంగ్ కూడా లేడీ వాయిస్ తో వచ్చే సోలో నెంబర్ సాంగ్.. హీరోయిన్ ప్రేమలో పడి ఆ ప్రేమలోని భావాలని తన ప్రేమికుడితో ఎంజాయ్ చేయాలనుకుంటూ ఊహించుకుంటూ పాడే పాత ఇది. ఈ పాటకి రమ్య బెహార తన పాటతో ప్రాణంపోసిందని చెప్పాలి. ముఖ్యంగా పాట చివర్లో వచ్చే లైన్స్ ని వినేవాళ్ళకి మత్తెక్కించేలా పాడింది. అనంత్ శ్రీ రామ్ ప్రేమలోని మొహాల్ని బాగా ఈ పాటలో చెప్పాడు. కీరవాణి మ్యూజిక్ కూడా ఈ పాటలానే చాలా కొత్తగా ఉంది. ఈ పాటకి కూడా వెస్ట్రన్ స్టైల్ మ్యూజిక్ ని అందించాడు. ఈ పాట వినగా వినగా మీకు బాగా నచ్చేస్తుంది.

4. పాట : అంతే ప్రేమంతే

గాయనీ గాయకులు : కెకె భైరవ, మోహన

సాహిత్యం : అనంత్ శ్రీరామ్

ఈ ఆల్బంలోని నాల్గవ పాట అంతే ప్రేమంతేను కెకె భైరవ, మోహన పాడారు. ప్రేమలో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ను ఈ పాటలో చెప్పారు. ఈ విరహగీతం కోసం కీరవాణి ప్రతి ఒక్కరు హమ్ చేసుకునే మరియు ఎంటర్టైనింగ్ ట్యూన్ కంపోజ్ చేశారు. ఫి మేల్ సింగర్ మోహన వాయిస్ శ్రోతలను కట్టిపడేస్తుంది. మధ్యలో కీరవాణి వినిపించిన లయబద్దమైన వీణ మ్యూజిక్ బాగుంది. ఈ పాట వినగానే ఆకట్టుకుంటుంది.

5. పాట : అందరి రాతలు

గాయనీ గాయకులు : రమేష్ వినాయగం, యామిని

సాహిత్యం : శివశక్తి దత్తా

శివశక్తి దత్తా లిరిక్స్ అందించిన అందరి రాతలు పాటకు కీరవాణి చాలా సాధారణమైన ట్యూన్ అందించారు. బట్.. ఈ ట్యూన్ క్యాచీగా, ఆకట్టుకునేలా ఉంది. ఆల్బంలో ఐదవ పాట ఇది. రమేష్ వినాయగం, యామిని పాడారు. ఈ పాటలో సాహిత్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రేమలో ఉండే భాదను అర్ధవంతంగా ఈ పాటలో తెలియజేశారు. కోరస్ పాడిన రాగాలు పాటకు హైలైట్ అని చెప్పాలి, అవి పాటకు ప్రాణంగా నిలిచాయి.

6. పాట : దిక్కులు చూడకు రామయ్యా

గాయని : కల్పన

సాహిత్యం : శరత్ జ్యోస్త్న

ఇక ఆల్బంలో ఆరవ పాటగా టైటిల్ సాంగ్ ‘దిక్కులు చూడకు రామయ్య’ పాటను పొందుపరిచారు. టోటల్ ఆడియోలో మాస్ సాంగ్ ఇదొకటే. సందర్భానుసారంగా ఇంటర్వెల్ ముందు ఈ పాటను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ పాట వింటుంటే ‘మర్యాదరామన్న’లో బీజియం మ్యూజిక్ గుర్తొస్తుంది. లిరిక్స్ సినిమాలో ముఖ్యమైన సన్నివేశంలో భావాన్ని వెల్లడించేలా ఉన్నాయి.

తీర్పు :

యం.యం.కీరవాణి ఎంతటి క్రియేటివ్ జీనియస్ అనేది ఈ ‘దిక్కులు చూడకు రామయ్యా’ ఆడియో ద్వారా మరోసారి నిరూపించారు. కమర్షియల్ సినిమా సంగీతం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో… అదే ఫార్మాట్ లో అందరూ చక్కగా విని ఆనందించే మరియు అందమైన పాటలను కంపోజ్ చేశారు. సినిమా విడుదలయిన తర్వాత పాటలు ఇంకా పెద్ద విజయం సాధిస్తాయి.

సంబంధిత సమాచారం :

More