సమీక్ష : ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ – ఫీల్ మిస్సయినా, ఫన్ మాత్రం గ్యారంటీ!

సమీక్ష : ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ – ఫీల్ మిస్సయినా, ఫన్ మాత్రం గ్యారంటీ!

Published on Dec 13, 2015 6:00 PM IST
Ee Cinema Superhit Guarantee-review

విడుదల తేదీ : 11 డిసెంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : చెందు ముద్దు

నిర్మాత : పి.ఎస్. సూర్య తేజా రెడ్డి

సంగీతం : వంశీ, మారుతీ రాజా

నటీనటులు : హెచ్.హెచ్.మహదేవ్, పునర్నవి భూపాలం, ఐశ్వర్య అడ్డాల, సిరి శ్రీ..

‘ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ’.. ఇలాంటి ఒక సినిమా పేరుతో దర్శకుడి ప్రయత్నమంటేనే అది సాహసంగా చెప్పుకోవచ్చు. అలాంటి టైటిల్‌తో మహదేవ్, పునర్నవి, ఐశ్వర్య, సిరి శ్రీ ప్రధాన పాత్రల్లో నటించగా దర్శకుడు చెందు ముద్దు ఓ సినిమా రూపొందించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా నిన్న (డిసెంబర్ 11న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ‘ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ’ పేరుకు తగ్గటే ఉందా? చూద్దాం..

కథ :

నాని (హెచ్.హెచ్.మహదేవ్).. అందరిలాగే తనదనే జీవితాశయం కోసం కలలు కంటూ సరదాగా ఫ్రెండ్స్‌తో కాలం వెళ్ళదీసే ఓ యువకుడు. సినీ దర్శకుడవ్వాలనే కలలుకనే నాని, ఆ క్రమంలోనే ఓ సీరియల్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ, సమయం చిక్కినప్పుడల్లా తన ఊరికి వచ్చేసి ఫ్రెండ్స్‌తో గడుపుతుంటాడు. ఈ ప్రయాణంలోనే నానికి శిరీష (ఐశ్వర్య అడ్డాల) అనే ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్తా కొద్దిరోజులకే ప్రేమగా మారిపోతుంది. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఆ అమ్మాయి వేరొకరిని పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. ఇక ఈ శిరీషని మరిచిపోయి కాలం వెళ్ళదీస్తున్న రోజుల్లోనే నానికి మరో శిరీష (సిరి శ్రీ) పరిచయం అవుతుంది. ఈ పరిచయం కూడా ప్రేమగా మారడం, ఆ తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఆ అమ్మాయి మరొకరిని పెళ్ళి చేసుకోవడం జరిగిపోతుంది.

దీంతో శిరీష అనే పేరే తనకు అచ్చిరాలేదనుకోవడంతో పాటు, మళ్ళీ ప్రేమించేదే లేదనుకుంటూ గడిపేస్తుంటాడు. ఈ సమయంలో నానికి మరో శిరీష (పునర్నవి భూపాలం) పరిచయం అవుతుంది. వీరిద్దరూ ప్రేమలో పడిపోతారు. ఈ శిరీషతోనూ చిన్న గొడవ పడి విడిపోయిన నాని, మళ్ళీ అనుకోకుండా కలుస్తాడు. అయితే ఆ సమయంలో శిరీష ఓ ఆపదలో చిక్కుకుంటుంది. ఆ ఆపద ఏంటి? దాన్నుంచి శిరీషను నాని ఎలా బయటపడేశాడు? ఈ మధ్యలో జరిగే కథేంటీ? అన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే చిన్న పాయింట్‌ను పూర్తిగా కన్ఫ్యూజింగ్ స్క్రీన్‌ప్లేతో, ఎక్కడా ఫన్ తగ్గకుండా నడిపించిన విధానం గురించి చెప్పుకోవచ్చు. ముగ్గురు శిరీషలతో తన ప్రేమకథలను హీరో పరిచయం చేయడంతో మొదలయ్యే కథ, చివరివరకూ ఎక్కడా గాడి తప్పకుండా కన్ఫ్యూజ్ చేస్తూనే చివరివరకూ నవ్విస్తుంది. సినిమాలో ఎక్కడా వల్గారిటీకి అవకాశమివ్వకుండా కూల్ కామెడీని అందించడంలో దర్శక రచయిత చూపిన నేర్పును మెచ్చుకోవాలి. చెప్పాలంటే చాలా సింపుల్‌గా కనిపించే కథనే ఎంతో గ్రిప్పింగ్‌గా చివరివరకూ నడపడంలో స్క్రీన్‌ప్లేలో తీసుకున్న జాగ్రత్తలు బాగున్నాయి.

హీరో మహదేవ్ పక్కింటి కుర్రాడిలా మాట్లాడుతూ, ప్రవర్తిస్తూ చాలా న్యాచురల్‌గా నటించాడు. ఇక ముగ్గురు హీరోయిన్లూ సినిమాలో మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలతో బాగానే మెప్పించారు. ఇక సెకండాఫ్‌లో పునర్నవి భూపాలం మంచి కామెడీ పండించడంతో పాటు క్యూట్‌గా కూడా నటించింది. హీరో ఫ్రెండ్‌గా నటించిన రాఘవేంద్ర రాజ్  సినిమా ఆద్యంతం మంచి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. మిగతా వారంతా తమ పరిధిమేర బాగానే నటించారు.

సినిమా పరంగా చూసుకుంటే ఫస్టాఫ్, సెకండాఫ్ రెండు భాగాల్లోనూ కామెడీకి పెద్ద పీట వేశారు. ట్విస్ట్‌లేవీ లేకున్నా కథను మంచి ఫ్లోలో నడిపారు. ఇక సెకండాఫ్‌లో ఇలాంటి సన్నివేశాలతో కూడా నవ్వించొచ్చా? అన్నట్లుగా ఉన్న కొన్ని సన్నివేశాలు చాలా కొత్తగా ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మైనస్ పాయింట్ అంటే సెకండాఫ్‌లో సినిమా కాస్త వేగం తగ్గడం గురించి చెప్పుకోవచ్చు. అదేవిధంగా అక్కడక్కడా కొన్ని పాత సినిమాల చాయలు కనిపిస్తాయి. ఇక కథ చాలా సాదాసీదాగా ఉంది. కేవలం ఫన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఎమోషన్‌ను కాస్తంత తగ్గించడంతో సినిమా కథలో బలం ఉన్నట్టు కనిపించదు. ఇక ఫస్టాఫ్‌లో అమ్మాయిల ఆలోచనా విధానాన్ని కాస్త తక్కువ చేసి చూపిన ఫీలింగ్ కలిగింది. సెకండాఫ్‌లో దీనికి జస్టిఫికేషన్ ఇచ్చినా అది మరీ సినిమాటిక్‌గా ఉంది.

ఇక కొన్ని సన్నివేశాల్లో సినిమాటిక్ స్వేచ్ఛను తీసేసుకొని కొన్ని లాజిక్‌లను పక్కన పెట్టేశారు. హీరో క్యారెక్టరైజేషన్ ఇంకాస్త బలంగా చెప్పి ఉంటే కథ సరిగ్గా చేరి ఉండేది. పాటలు వినడానికి, చూడడానికి బాగున్నాయి కాని, కొంచెం పాతకాలం పాటల్లా ఉండడం మైనస్‌గా చెప్పుకోవచ్చు. క్లైమాక్స్‌ బాగుంది కానీ అక్కడ కూడా ఎమోషన్‌ను సరిగ్గా అందుకున్నట్లు కనిపించలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చెప్పుకుంటే మొదట దర్శక, రచయిత చెందు ముద్దు గురించి చెప్పుకోవాలి. ఒక క్లీన్, క్లాస్, కూల్ కామెడీ సినిమాను చేయడానికి ఓ మామూలు కథనే ఎంచుకున్నా, స్క్రీన్‌ప్లే పరంగా డైలాగ్స్ పరంగా మాత్రం చక్కటి ప్రతిభ కనబరిచాడు. డైలాగుల్లో మంచి ఫన్‌ని ఉంచుతూనే ఎక్కడా వల్గారిటీకి చోటివ్వని విధానాన్ని మెచ్చుకోవాలి. మేకింగ్ పరంగా చెందు తన పరిధి మేర ప్రతిభ కనబరిచాడు. చాలా చోట్ల (ముఖ్యంగా పాటల్లో) దర్శకుడు వంశీని ఫాలో అయినట్లు కనిపిస్తుంది. రచయితగా మాత్రం చెందు ఈ సినిమాను భుజాలపై నిలబెట్టాడు.

ఇక వంశీ అందించిన రెండు పాటలతో పాటు, మారుతీ రాజా సందర్భానుసారంగా వచ్చాయి. కొంచెం రెట్రో స్టైల్ ఈ పాటల్లో కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే షాట్ కంపోజిషన్‌లో కొన్ని ప్రయోగాలు చేయబోయి విఫలమయినట్లు కనిపిస్తుంది. ఎడిటింగ్ పనితనం ఫర్వాలేదు. అయితే సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేస్తే బాగుండేది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

ఏ భాషా సినిమా అయినా కామెడీ అనే జానర్‌కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అయితే అది సరిగ్గా పండింతే ఎంతైనా ఆదరించేసేలా, ఏమాత్రం అటూ ఇటైనా పూర్తిగా పక్కనపెట్టేసేలా చేయగలిగే డేంజరస్ జానర్. ఆ జానర్‌కున్న క్రేజ్‌ను నమ్ముకొని దర్శకుడు చెందు చేసిన ప్రయత్నమే ‘ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ’. పేరులోనే ఎనర్జీని, పాజిటివ్ ఆటిట్యూడ్‌ను నింపుకున్న ఈ సినిమాను నిలబెట్టేది కూడా కామెడీని పండించడానికి దర్శకుడు ఎంచుకున్న ఎనర్జిటిక్ పాయింట్, పాజిటివ్ అప్రోచ్ అనే చెప్పాలి. ఒక తెలిసిన కథనే ఆసక్తికర కథనంతో, ఆద్యంతం నవ్వించే సన్నివేశాలతో నడిపించిన విధానమే ఈ సినిమాకు మేజర్ హైలైట్ కాగా, అక్కడక్కడా వేగం తగ్గడం, కాస్త క్యారెక్టరైజేషన్ విషయంలో గందరగోళం పడడం లాంటివి మైనస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. ఎక్కువగా సీరియస్ కథాంశం, ఎమోషన్‌ను నమ్ముకోని ఈ సినిమాను కామెడీ కోసం మాత్రమే చూడాలని ఫిక్సయితే మాత్రం ఆ విషయంలో ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ! అదే సీరియస్ అంశాలనే ఇష్టపడే వారికి ఈ సినిమాలో అలాంటి అంశాల్లేవ్!

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు